ఎకో టూరిజం అభివృద్ధికి సహకరించాలి
సాక్షి,పాడేరు: పర్యావరణహిత పర్యాటకాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ కోరారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో మాడగడ, వంజంగి ప్రాంత ప్రజాప్రతినిధులు, గిరిజనులతో బుధవారం సమావేశం నిర్వహించారు. వంజంగి మేఘాల కొండ, మాడగడ వ్యూపాయింట్‌లో పర్యాటక అభివృద్ధిపై సమీక్షించి,గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనసంరక్షణ సమితుల ఆధ్వర్యంలో వంజంగి, మాడగడలో ఎకో టూరిజం అభివృద్ధికి స్థానిక గిరిజనులు అటవీ, రెవెన్యూశాఖలకు సహకరించాలన్నారు.జిల్లా యంత్రాంగం గ్రామసభలు పెట్టి స్థానిక గిరిజనుల సలహాలు,సూచనలతో చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం అభివృద్ధిపై సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఐటీడీఏ, అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉమ్మడి సహకారంతో ముందుకు వెళతామన్నారు. వంజంగి, మాడగడ పర్యాటక ప్రాంతాలు రిజర్వ్ పారెస్ట్ పరిధిలో ఉన్నందున ప్రజల అభిప్రాయాలకు విలువ ఇచ్చి పర్యావరణానికి హాని లేకుండా పర్యాటకాభివృద్ధి చేస్తామని చెప్పారు. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందితే వాటి ద్వారా వచ్చే ఆదాయం ఆయా గ్రామాల గిరిజనుల జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి దోహద పడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, వంజంగి, లగిశపల్లి, కాడెలి, మాడగడ పంచాయతీల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్
ఎకో టూరిజం అభివృద్ధికి సహకరించాలి


