పరిహారమిస్తే.. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఓకే
● జెన్‌కో అధికారులకు తేల్చిచెప్పిన
నిర్వాసితులు
● డిమాండ్లతో కూడిన వినతిపత్రం
అందజేత
సీలేరు: తమకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లిస్తే సీలేరులో నిర్మించనున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు అంగీకరిస్తామని నిర్వాసిత గ్రామాల ప్రజలు తేల్చిచెప్పారు. నిర్వాసిత గ్రామాలైన పార్వతీనగర్, బూసుకొండ, సాండ్ కోరీ గ్రామస్తులు, సీలేరు అఖిల పక్ష నాయకులతో మంగళవారం సీలేరులోని ఏపీ జెన్‌కో గెస్ట్ హౌస్‌లో జెన్‌కో అధికారులు సమావేశమయ్యారు. నిర్వాసితుల డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. నష్టపోతున్న ఇంటికి బదులుగా భూమి, ఇంటికొక ఉద్యోగం, 50 పడకల ఆస్పత్రి, స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు, పక్కా ఇల్లు నిర్మించుకునేలా సాయం, తాగునీరు, విద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తే ప్రాజెక్ట్ నిర్మించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు జెన్‌కో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జెన్‌కో చీఫ్ ఇంజినీర్ రాజారావు మాట్లాడుతూ నిర్వాసిత ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఏ గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని విజయవాడ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సివిల్ హైడల్ రత్నకుమార్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా భూగర్భంలో జరుగుతుందని, సీలేరు గ్రామాన్ని తరలించాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో అధికారులు చంద్రశేఖర్‌రెడ్డి, బాలకృష్ణ, అప్పలనాయుడు, జైపాల్, సురేష్ పాల్గొన్నారు.


