పెండింగ్ భూ సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూశాఖకు సంబంధించిన పలు ఆంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పెండింగ్‌లో ఉన్న భూముల రీసర్వే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి,వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.అన్నదాత సుఖీభవ పథకంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల మ్యూటేషన్లను పూర్తి చేయాలన్నారు. ప్రజా పరిష్కార వేదిక ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జీవో నంబర్ 30 దరఖాస్తుల అనుమతుల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని,జీవో నంబర్ 23 ద్వారా అర్హత ఉన్న వారికి ఇళ్ల స్థలాలు అందించేందుకు గ్రామ స్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం పరిహారం అందించే వరకు చట్టప్రకారం రావాల్సిన సంక్షేమ పథకాలను అందించాలని, పౌరసరఫరాల సేవలను ఆన్‌లైన్‌లో పొందు పరచాలని ఆదేశించారు.
ఓడీఎఫ్ జిల్లాగా మార్చాలి
బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్) జిల్లాగా మార్చేందుకు అధికారులు శ్రమించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు,ఆర్‌డబ్ల్యూఎస్,ఆరోగ్యశాఖ,గృహనిర్మాణం తదితర ఽశాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సిబ్బంది ఇంటింటా తిరిగి వ్యక్తిగత మరుగుదొడ్లపై పరిశీలన జరపాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక స్థలాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేయాలన్నారు. జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చాలని,హైరిస్క్ గర్భిణులను గుర్తించి సకాలంలో మెరుగైన వైద్యసేవలు కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ లోకేశ్వరరావు,డీఆర్‌వో పద్మలత,పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.


