రోడ్డు ప్రమాదంలో బీఎస్‌ఎఫ్ జవాను మృతి
● ఆరుగురికి తీవ్రగాయాలు
● విధుల్లో చేరేందుకు వస్తుండగా ఘటన
చింతూరు: సెలవుపై వెళ్లి ఒకరోజు ముందువరకు ఆత్మీయులతో సంతోషంగా గడిపిన ఆ జవాన్లు సెలవులు ముగియడంతో తిరిగి విధుల్లోకి చేరేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చింతూరు మండలం గొర్లగూడెం వద్ద జాతీయ రహదారి–30పై మంగళవారం తెల్లవారుఝామున జరిగిన ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌరవ్‌కుమార్ పాండే(43) అనే బీఎస్‌ఎఫ్ జవాను మృతిచెందాడు. ఒడిశాలోని బలిమెలలో విధులు నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ 142 బెటాలియన్‌కు చెందిన ఆరుగురు జవాన్లు సెలవులపై స్వగ్రామం వెళ్లారు. సెలవులు ముగియడంతో వీరంతా రైలులో సోమవారం రాత్రి ఖమ్మం చేరుకుని అక్కడినుంచి కారులో ఒడిశాలోని బలిమెలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మంగళవారం తెల్లవారుఝామున చింతూరు మండలం గొర్లగూడెం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి కల్వర్టును ఢీ కొంది. కారు ముందుభాగం బాగా దెబ్బతింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ గౌరవ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, కానిస్టేబుళ్లు అభితాబ్‌సింగ్, దేవ్‌కుమార్, జమీల్, గుర్జీత్‌సింగ్, వాసవభవత్‌తో పాటు వాహన డ్రైవర్ అజిత్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చింతూరు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమికి చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో బీఎస్‌ఎఫ్ జవాను మృతి


