ముస్తాబవుతున్న శివాలయాలు
మహారాణిపేట: ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. శివనామ స్మరణలు, దీపాల సందళ్లతో నెల రోజుల పాటు ఆలయాలు కళకళలాడనున్నాయి. కార్తీక మాసం సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచే ఆలయాల్లో ఆకాశ దీపం వెలిగిస్తారు. శివునికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం కోసం జిల్లాలోని శివాలయాలను దేవాదాయ శాఖ ముస్తాబు చేస్తోంది. మంగళవారం నవంబర్ 20 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయి.
ఏర్పాట్లపై దృష్టి : దేవాదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత పర్యవేక్షణలో జిల్లా సహాయ కమిషనర్ ఇన్‌చార్జ్ ప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, పందిళ్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు దీపాలు పెట్టే ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏసీ ప్రసాదరావు సూచించారు. కార్తీక మాసంలో విధులు నిర్వహించడానికి సుమారు 100 మంది ప్రత్యేక సిబ్బందిని వివిధ దేవాలయాల్లో నియమించారు. జిల్లా పరిధిలో భక్తులు అధికంగా వచ్చే 9 ప్రధాన శివాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించామని, క్యూలైన్లలో భక్తులు వేచి ఉండకుండా చర్యలు తీసుకుంటామని ఏసీ ప్రసాదరావు తెలిపారు. కార్తీక సోమవారాల ఏర్పాట్లను తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఆయన పేర్కొన్నారు.
కార్తీక సోమవారాలు
ఈనెల 27 (మొదటి), నవంబర్ 3
(రెండో), నవంబర్ 10 (మూడో),
నవంబర్ 17 (నాలుగు).
కార్తీక పౌర్ణమి/జ్వాలా తోరణం:
నవంబర్ 5
పోలి స్వర్గం: నవంబర్ 21


