నత్త నడకన ఈ–క్రాప్
మహారాణిపేట: పంట నష్టపరిహారం, పంటల బీమా, రుణాలు, సున్నా వడ్డీ, కనీస మద్దతు ధర వంటి ప్రభుత్వ రాయితీలు పొందాలంటే తప్పనిసరి అయిన ఇ–క్రాప్ నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఎంతో కీలకమైన ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలుత సెప్టెంబర్ 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించినప్పటికీ, లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో దీన్ని అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ–క్రాప్ బుకింగ్‌లో రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానశాఖ సిబ్బందికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా నెట్‌వర్క్ సమస్యలు, పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వ యం లోపం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత ఆలస్యానికి కారణాలని తెలుస్తోంది. ముఖ్యంగా భూమి రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇ–క్రాప్ బుకింగ్‌లో జిల్లాలో ఇప్పటివరకు సుమారు 80 శాతం పూర్తయింది. జిల్లాలో 11,599 ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 75 శాతం అంటే 8,247 ఎకరాల్లో ఇ–క్రాప్ నమోదు పూర్తయ్యింది.
నెలాఖరునాటికి పూర్తి : జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి మాట్లాడుతూ... ఈ–క్రాప్ ద్వారా ఏ రైతు ఏ సర్వే నంబర్‌లో ఏ రకం పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ నెలాఖరు నాటికి నూరు శాతం ఇ–క్రాప్ నమోదు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు సులభంగా అందేందుకు రైతులు అధికారులకు సహకారం అందించాలని ఆయన కోరారు.


