ట్రంప్ వాణిజ్య యుద్ధంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్ర
డాబాగార్డెన్స్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నిటిపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి లోకనాథం ఆందోళన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం జగదాంబ జంక్షన్ సమీపాన కార్మిక భవనంలో ఎండీ ఆనంద్‌బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ట్రంప్ విధించిన టారీఫ్ సుంకాల వల్ల మన దేశంలోని వ్యవసాయ రంగం ధ్వంసమై, పారిశ్రామికోత్పత్తి దెబ్బతింటోందన్నారు. సేవా రంగం గందరగోళంలో పడి మొత్తం ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రం చేస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా, టెక్స్‌టైల్, గార్మెంట్, పట్టు వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. దీని ఫలితంగా ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం రోడ్డున పడి ఇంటా బయటా ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, విద్యార్థులు, యువత భవిష్యత్తు ఆగమ్యగోచరమవుతుందని ఆయన పేర్కొన్నారు. మన దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అందిపుచ్చుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ట్రంప్ అడుగులకు మడుగులొత్తే లొంగుబాటు వైఖరిని ప్రదర్శిస్తోందని లోకనాథం విమర్శించారు. భారత్ నుంచి దిగుమతయ్యే టెక్స్‌టైల్, దుస్తులు, రొయ్యలు, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులు, లెదర్, వజ్రాభరణాలు వంటి అన్నింటిపైనా ట్రంప్ ప్రభుత్వం సుంకాలు పెంచిందన్నారు. గతంలో 2.5 శాతం ఉన్న సుంకాలను 50 శాతానికి పెంచడం వల్ల దాదాపు 7 లక్షల కోట్లకు పైగా భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా వేశారు. మన ఉత్పత్తులకు మార్కెట్ తగ్గడంతో పరిశ్రమలు, సేవారంగం దెబ్బతిని, ఉద్యోగులు, కార్మికులు వీధిన పడతారని ఆయన వివరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఉపాధ్యక్షులు తిరుకోటి చిరంజీవి, బొమ్మల రఘురామ్, కె. రంగమ్మ, కె. క్రాంతిబాబు, ఎ. తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కొత్తపల్లి లోకనాథం


