‘డ్యూడ్’కి అద్భుత రెస్పాన్స్
డాబాగార్డెన్స్: యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’.. దీపావళి కానుకగా విడుదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తి శ్వరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మమితా బైజు కథానాయికగా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకుని, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘డ్యూడ్ ’దివాళీ టూర్‌ను చేపట్టారు. తమ సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విశాఖ విచ్చేసిన హీరో ప్రదీప్ రంగనాథన్.. నగరంలోని రామా టాకీస్, సంగం శరత్ థియేటర్లలో ప్రేక్షకులతో ‘డ్యూడ్ దివాళీ బ్లాస్ట్’ పేరుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమిళనాడులోనూ గత చిత్రాల కంటే ‘డ్యూడ్’కు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. ‘నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్లు ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఈ ఘన విజయానికి కారణమైన దర్శకుడికి, నిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


