అడవి దాటే దారేది ?
అటవీశాఖ అభ్యంతరాలతో అభివృద్ధికి విఘాతం
ఏళ్ల తరబడి అనుమతులకు నోచుకోని రోడ్లు
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు
రంపచోడవరం: అటవీశాఖ అభ్యంతరాలతో రోడ్ల నిర్మాణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో రంపచోడవరం డివిజన్‌లో సుమారు 30 రోడ్ల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటిలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్వంలో నిర్మిస్తున్న 11, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 15 రోడ్ల నిర్మాణాలున్నాయి. రంపచోడవరం, వై రామవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లో పలు రోడ్ల నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో 200 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
● కూనవరం మండలంలో చినార్కూరు నుంచి బోదునూరు వరకూ 4.5 కిలోమీటర్ల రోడ్డును రూ.1.75 కోట్ల వ్యయంతో మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఎన్నికల ముందు శంకుస్థాపన చేశారు. రెండు కిలోమీటర్ల రోడ్డుకు అభ్యంతరం లేకపోయినా మిగతా 2.5కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో పనులు నిలిపివేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వరదల సమయంలో 15 గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కోతులగుట్టలోని పునరావాస కేంద్రానికి రావాలన్నా, పంద్రాజుపల్లి–కోతులగుట్ట రోడ్డు నీట మునిగిన సమయంలో మండ ల కేంద్రం కూనవరం చేరుకోవాలన్నా ఈరోడ్డు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
● రాజవొమ్మంగి మండలంలో లోదొడ్డి నుంచి కిండంగి గ్రామానికి గ్రావెల్ రోడ్డు మంజూరు చేశా రు. సుమారు 4.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.1.75 కోట్లు మంజూరయ్యాయి.అనుమతులు లేకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.కిండంగి నుంచి లోదొడ్డి రావాలంటే కాలినడకే శరణ్యం. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే కోదు సామాజిక వర్గానికి చెందిన దాదాపు వంద కుంటుంబాల వారికి రవాణా సౌకర్యం కలుగుతుంది.
● మారేడుమిల్లి మండలంలో పలు రోడ్లు అటవీశాఖ అభ్యంతరాలతో నిలిచిపోయాయి. తాడేపల్లి నుంచి వేటుకూరు వరకూ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన తరువాత మధ్యలో నిలిపివేశారు. సుమారు 15 ఏళ్ల నుంచి రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదు. ఈ మండలంలో పంచాయతీ రాజ్‌శాఖ చేపట్టిన సుమారు పది రోడ్ల నిర్మాణాలు అటవీ అభ్యంతరాలతో నిలిచిపోయాయి. దీంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అటవీశాఖ నుంచి అనుమతులు పొంది రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరుతున్నారు.
లోదొడ్డి నుంచి కిండంగి వెళ్లే కాలిబాట
అనుమతుల కోసం చర్యలు
అటవీశాఖ అభ్యంతరాలు తొలగింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. అటవీ అధికారులు నేషనల్ పార్క్, భూమి కేటాయింపు వంటి అనేక కారణాలు చెబుతున్నారు. దీంతో రోడ్ల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. అనుమతులు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– చైతన్య, గిరిజన సంక్షేమశాఖ డీఈ
అడవి దాటే దారేది ?


