పండగ బిజినెస్ తుస్
● వర్షం ఎఫెక్ట్
● బాణసంచా విక్రయాలకు వాన దెబ్బ
● ఆందోళన చెందుతున్న వ్యాపారులు
సాక్షి,పాడేరు/కొయ్యూరు/రాజవొమ్మంగి: వెలుగు ల పండగ దీపావళి అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమే. కుటుంబమంతా బాణ సంచా కాలుస్తూ ఆనందిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏటా రూ.కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. అయితే ఈ ఏడాది వ్యాపారుల ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. జిల్లాలో రెండు రోజులుగా జోరుగా వర్షం కురుస్తుండడంతో పండగ కళతప్పింది. దీపావళి పండగను పురస్కరించుకుని పాడేరు జూనియర్ కళాశాల మైదానంలో 18 బాణసంచా దుకాణాలకు కలెక్టర్, ఇతర అధికారులు అనుమతులు ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రాకర్స్ అమ్మకాలు జరుపుదామని దుకాణాలు ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. బాణసంచాను భద్రపరిచేందుకు ఇబ్బందులు పడ్డారు. టార్పాలిన్లు కప్పి ఉంచినప్పటికీ తేమశాతం అధికంగా ఉండడంతో వారంతా భయపడుతున్నారు.18 దుకాణాలకు సంబంధించి సుమారు రూ.60 లక్షల విలువైన బాణసంచాను వ్యాపారులు సిద్ధం చేశారు. ఏటా రూ.కోటి వరకు వ్యాపారం జరుగుతుంది.ఈఏడాది భారీ వర్షాలు కురవడంతో బాణసంచా వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నాయి. వీటితో పాటు ప్రమిదలు, మిఠాయిలను విక్రయించేందుకు వ్యాపారులకు ఏర్పాట్లు చేశారు. జోరువానతో దుకాణాల వద్ద వ్యాపారం జరగలేదు. ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు.పూజాసామగ్రి అమ్మకాలు జరగకపోవడంతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు. చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యా రు. కొయ్యూరు సంతలో ముగ్గురు వ్యాపారులు లైసెన్సులు తీసుకుని రూ.లక్షల విలువైన బాణసంచాను విక్రయానికి సిద్ధం చేశారు. భారీగా వర్షం కురవడంతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. శనివారం రాత్రి నుంచి కొయ్యూరులో వర్షం కురుస్తూనే ఉంది.ఆదివారం మధ్యాహ్నం వర్షం కురవడంతో సంత కూడా సరిగా జరగలేదు. రాజవొమ్మంగి మండలంలో నాలుగు బాణసంచా దుకాణాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. భారీగా వర్షం కురవడంతో వ్యాపారం జరగలేదు.
పండగ బిజినెస్ తుస్


