
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
కృష్ణమూర్తి నాయక్
● ఇద్దరు పర్యవేక్షక సిబ్బంది,
స్టాఫ్ నర్స్‌కు షోకాజ్ నోటీసులు
పాడేరు రూరల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ హెచ్చరించారు. మండలంలో మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులతో కొద్దిసేపు మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పర్యవేక్షక సిబ్బందితో పాటు స్టాఫ్ నర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది తీరు మార్చుకోవాలని, లేకపోతే ఉపేక్షించేది లేదన్నారు. మలేరియా నిర్ధారణ రక్తపూతల నమోదు సక్రమంగా నిర్వహించాలని ల్యాబ్ టెక్నీషియన్‌కు సూచించారు. డయేరియా, మలేరియా మందులు, పాము, కుక్కకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. ప్రజారోగ్యంపై సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.