
అనధికార మద్యం, డ్రగ్స్‌పై పటిష్ట నిఘా
మహారాణిపేట: జిల్లాలో అనధికార మద్యం అమ్మకాలు జరగకుండా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పటిష్టమైన నిఘా ఉంచాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎకై ్సజ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జోనల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ కీలక సూచనలు చేశారు. అక్రమ మద్యం అమ్మకాలపై సమాచారం అందించడానికి గ్రామ/వార్డు కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, శానిటేషన్ సిబ్బంది ఎకై ్సజ్ శాఖకు సహకరించాలన్నారు. గంజాయి, గంజాయి చాక్లెట్లు వంటి మాదక ద్రవ్యాల అమ్మకాలను కూడా పసిగట్టి నిరోధించాలని ఆదేశించారు. స్థానికంగా మద్యం తయారీ లేదా కల్తీ మద్యం అమ్మకాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, లేబుల్ లేని బాటిల్స్ అమ్మకూడదని స్పష్టం చేశారు. తక్కువ రేటుకు వస్తోందని నాసిరకం మద్యం తాగవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం బ్రాండెడ్ మద్యాన్ని మాత్రమే సరఫరా చేస్తుందని వివరించారు. అనుమతి లేని దుకాణాలు, లైసెన్సు రద్దయిన బార్‌లు, దాబాలు, అలాగే పాత భవనాలు, చీకటి ప్రదేశాలు, శ్మశాన వాటికల వద్ద మద్యపానం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్వయంశక్తి సంఘాల మహిళలకు అక్రమ మద్యం నిరోధంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎకై ్సజ్ సూపరిండెంటెంట్ ఆర్.ప్రసాద్ మాట్లాడుతూ.. అక్రమ మద్యం గుర్తించడానికి ప్రభుత్వం ‘ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్’ను తీసుకొచ్చిందని, దీని ద్వారా ప్రతి బాటిల్‌ను స్కాన్ చేసి అమ్మకాలు చేయాలని సూచించారు. బెల్ట్ షాపుల సమాచారంపై ఎకై ్సజ్ సిబ్బంది చర్య తీసుకోకపోతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో జేసీ మయూర్ అశోక్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.