
ప్రమాద స్థాయికి తాండవ నీటిమట్టం
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటిమట్టం బుధవారం నాటికి 377.4 అడుగులకు చేరింది. మరో అడుగు నీటిమట్టం పెరిగితే ప్రమాద నివారణ చర్యలో భాగంగా గేట్లు ద్వారా నదిలోకి నీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోనే ఏకై క మేజరు ప్రాజెక్టు తాండవ నుంచి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టకు నీటిని ఆగస్టు 10న విడుదల చేశారు. ఆ సమయంలో ప్రాజెక్టులో 363.0 అడుగులు మాత్రమే ఉండేది. ఈ ఏడాది అధికంగా వర్షాలు కురవడంతో ప్రస్తుతం నీటిమట్టం 377.4 అడుగులు ఉంది. రిజర్వాయరు ప్రమాద స్థాయి నీటిమట్టం 380 కాగా, డెడ్ స్టోరేజీ 345 అడుగులుగా పరిగణిస్తారు. ఇంకా ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 900 క్యూసెక్కులు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువల ద్వారా రోజుకు 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. నీటి మట్టం 378.0 అడుగులకు వచ్చేసరికి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తామన్నారు.