సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం

Oct 14 2025 7:05 AM | Updated on Oct 14 2025 7:05 AM

సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం

సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం

ఐటీడీఏ ముట్టడిలో ఆదివాసీ జేఏసీ నాయకుల హెచ్చరిక

చింతూరు: సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా అవసరమైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని ఆదివాసీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఏజెన్సీలో వందశాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలతోనే భర్తీచేయాలనే డిమాండ్‌తో ‘హలో చింతూరు–చలో ఐటీడీఏ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాలుగు మండలాలకు చెందిన ఆదివాసీలు చింతూరు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చిన ఆదివాసీ యువత ముందుగా చింతూరు మెయిన్‌రోడ్‌ సెంటర్‌ నుంచి ఎర్రంపేటలోని ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. జేఏసీ జాతీయ నాయకులు మడివి నెహ్రూ, అప్పలనర్స మాట్లాడుతూ ఆదివాసీ నిరుద్యోగుల కోసం ఏజెన్సీ స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ కారణంగా స్థానిక ఆదివాసీలు ఐదువేల టీచర్‌ పోస్టుల వరకూ నష్టపోయారన్నారు. గిరిజనేతర ఉపాధ్యాయులకు మైదాన ప్రాంతాల్లోనే పోస్టింగులు ఇవ్వాలని వారు కోరారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ గిరిజనేతరుల అక్రమ కట్టడాలను తొలగించాలని, ఆదివాసీ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వారు ఏపీవో రామతులసికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూనవరం జెడ్పీటీసీ గుజ్జా విజయ, వీఆర్‌పురం ఎంపీపీ కారం లక్ష్మి, సర్పంచ్‌లు, జేఏసీ నాయకులు పులి సంతోష్‌, సీసం సురేష్‌, జల్లి నరేష్‌, తిమ్మ సాయి, పొడియం రామకృష్ణ, సాయిబాబు, సీతారామయ్య, ప్రదీప్‌, బుర్రయ్య పాల్గొన్నారు.

పాడేరులో...

పాడేరు: ఆదివాసీ నిరుద్యోగుల కోసం ఐటీడీఏ పరిధిలో స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించాలని, జీవో నంబర్‌.3 పునరుద్ధరించాలని ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ సాధన సమితి జిల్లా కన్వీనర్‌ సాగిన ధర్మన్నపడాల్‌, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్‌ సాగిన సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆదివాసీ నిరుద్యోగులు ఆందోళన చేశారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాడేరులో ర్యాలీ నిర్వహించి, ఐటీడీఏ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ధర్మన్నపడాల్‌, సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన డీఎస్సీ కారణంగా ఆదివాసీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత ఎన్నికల సమయంలో జీవో నంబర్‌ 3ను పునరుద్దిస్తామని, ఐటీడీఏల పరిధిలో స్పెషల్‌ డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు ఆ తరువాత ఆదివాసీ నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. ఐటీడీఏల పరిధిలో స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించాలని, ఐదో షెడ్యూల్డ్‌ ఏరియాలో చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, జీవో నంబర్‌ 3 పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగ సంఘం జిల్లా నాయకులు అరుణకుమారి, వంపూరి స్వాతీ లత, గంపరాయి భాను, అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement