
కస్తూర్బాలో అపరిశుభ్రతపై మేజిస్ట్రేట్ ఆగ్రహం
రంపచోడవరం: స్థానిక కసూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పారిశుధ్యం లోపించడంపై మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.ఎం. మురళీగంధర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో అపరిశుభ్రవాతావరణం ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన బాలలకు అందించే ఆహారంలో విషయంలో తగిన శ్రద్ధ చూపించాలని,గదులు శుభ్రంగా ఉంచాలని పాఠశాల హెచ్‌ఎంకు సూచించారు. విద్యార్థినుల భవిష్యత్తు, ఆరోగ్యం, చదువుపైన శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
పచ్చ కామెర్ల బాధితుల తరలింపు
మహారాణిపేట: కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 21 మంది పచ్చ కామెర్ల బాధితులను సోమవారం కేజీహెచ్ నుంచి పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థులకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని, వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే తరలించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. డాక్టర్ గిరినాథ్ (గ్యాస్ట్రో ఎంటాలజీ), డాక్టర్ శివకళ్యాణి (మైక్రోబయాలజీ), డాక్టర్ కృష్ణవేణి (కమ్యూనిటీ మెడిసిన్), డాక్టర్ వాసవి లత (జనరల్ మెడిసిన్), డాక్టర్ చక్రవర్తి (పిల్లల వైద్యుడు) సహా ఐదుగురు వైద్యుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థుల తరలింపు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు పలు విడతల్లో మొత్తం 44 మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు సూపరింటెండెంట్ వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 50 మంది విద్యార్థినులు పచ్చ కామెర్ల బారిన పడ్డారు. వీరిలో తొమ్మిదో తరగతి చదువుతున్న తోయిక కల్పన, పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి ఆధ్వర్యంలో గ్యాస్ట్రో ఎంటాలజీ, జనరల్ ఫిజిషియన్, ఇతర వైద్యులు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు.
ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించాలి
బీచ్‌రోడ్డు: నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలను వెంటనే కొనసాగించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పేద ప్రజల వైద్యంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ఏడు నెలలుగా కూటమి ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించలేదనే నెపంతో ఈ నెల 10వ తేదీన ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేయడంతో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయని మండిపడ్డారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నెయ్యల నాగభూషణరావు, మన్మథరావు, క్షేత్రపాల్ రెడ్డి, పార్టీ జిల్లా సమితి సభ్యులు సీహెచ్. కాసుబాబు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు పుష్పలత, మత్స్య కార్మిక సంఘం నాయకులు కోడా వజ్రం, మీసాల శ్రీనివాస్, మత్స్య కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుపల్లి నల్లయ్య, అరిలోవ సీపీఐ పార్టీ శాఖ కార్యదర్శి లక్ష్మణరావు, అత్తిలి రవి పాల్గొన్నారు.