
ఐటీడీఏ గ్రీవెన్స్‌లో సమస్యల ఏకరువు
రంపచోడవరం: ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో స్మరణ్‌రాజ్, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్‌లు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. గిరిజనులు తమ సమస్యలపై ఏకరువు పెట్టి, అర్జీలు అందజేశారు. ఉపప్రణాళిక ప్రాంతంలోని గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని, రౌతులపూడి మండలంలోని లచ్చిరెడ్డిపాలెంలో భూములను వ్యవసాయ యోగ్యంగా చేయాలని కోరుతూ అవిటి సాంబమూర్తి, నాగేశ్వరరావు, గంగరాజు ఐటీడీఏ గ్రీవెన్స్‌లో అర్జీ అందజేశారు. గంగవరం మండలంలోని లక్కొండ, గొరగొమ్మి పెదగార్లపాడు మీదుగా 15 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టాలని, లక్కొండ గ్రామంలో 60 ఎకరాలకు సాగు నీరందించే కొమ్మిరెడ్డి చెరువుకు మరమ్మతులు చేయించాలని వేట్ల సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ రామకృష్ణ మిషన్ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేయాలని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ, మెడికల్ క్యాంపు కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాసు కోరారు. అనంతరం పీవోకు స్వామివివేకానంద చిత్రపటాన్ని స్వామీజీ అందజేశారు.