
గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గిరిజన సంఘాలు, యువత, నాయకులు రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఎదుట ఏజెన్సీ నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొని ధర్నా చేశారు. ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ విడుదల చేయాలని, 2025 డీఎస్సీ నోటిఫికేషన్ ఐదో షెడ్యూల్ చట్టాలకు విరుద్ధంగా ఉందని, జీవో 3 స్థానంలో కొత్త జీవో అమలు చేసి గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో నూరు శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులతో భర్తీ చేయాలన్నారు. ఐటీడీఏ ఎదుట గిరిజనులు బైఠాయించడంతో సుమారు ఐదు గంటలు పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం ధర్నా వద్దకు వచ్చిన ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్, సబ్ కలెక్టర్, శుభమ్ నొఖ్వాల్, డీఎస్పీ సాయిప్రశాంత్‌లు గిరిజన యువత, నాయకులతో మాట్లాడారు. జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్న అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.