
సత్తాచాటిన జూనియర్ అథ్లెట్లు
విశాఖ స్పోర్ట్స్: 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అథ్లెట్లు వెంకట్రామ్, శేషు పతకాలు సాధించారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ మీట్‌లో ఎం. వెంకట్రామ్ అండర్–20 బాలుర 800, 1500 మీటర్ల పరుగుల్లో విజేతగా నిలిచి స్వర్ణాలు అందుకున్నాడు. విశాఖ అథ్లెట్ డి. శేషు అండర్–18 బాలుర విభాగపు 200 మీటర్ల పరుగును 22.09 సెకన్లలో పూర్తి చేసి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఆంధ్ర జట్టుకు కోచ్‌గా వైకుంఠరావు వ్యవహరించగా, పతకాలు సాధించిన వీరిద్దరినీ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు అభినందించారు.
కేజీహెచ్‌లో
ఫుట్ స్కానింగ్ ప్రారంభం
మహారాణిపేట(విశాఖ): ఫుట్ స్కానింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి అన్నారు. సోమవారం కేజీహెచ్ ఆర్థోపెడిక్ ఓపీలో ఏపీ మెడిటెక్ జోన్ సహకారంతో వైద్యులకు, పోస్ట్–గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ, పాదంలో బరువు ఎలా సమతుల్యంగా ఉందో దీని ద్వారా తెలుస్తుందన్నారు. ఈ సౌకర్యం ఇంతవరకు హైదరాబాద్‌లో మాత్రమే ఉందని, కానీ నేటి నుంచి విశాఖలో కూడా ఈ సౌకర్యం లభిస్తుందన్నారు. ఏపీ మెడిటెక్ జోన్ ద్వారా ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ ద్వారా ఈ అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. పాదంలో జరుగుతున్న మార్పులను ముందుగా తెలుసుకోవడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పాదాలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను నిరోధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ ఎం. చంద్రశేఖరం నాయుడు, ఆంధ్రా మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి. మన్మధరావు, పిల్లల విభాగాధిపతి డాక్టర్ బీ.ఎన్. చక్రవర్తి, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.వి. సుబ్రహ్మణ్యం, ఇతర విభాగాల వైద్యులు, పీజీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.