
మన్యం గుమ్మడికి భలే డిమాండ్
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల్లోని వారపు సంతల్లో గుమ్మడికాయల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ ఏడాది గుమ్మడికాయల దిగుబడి ఎక్కువగా ఉండడంతో గిరిజనులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఒడిశా వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. ఒడిశాలోని ప్రతి హోటల్‌లో గుమ్మడి కూర వండుతుంటారు. అందువల్ల మంచి డిమాండ్ ఉంది.
● జిల్లాలో ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, హుకంపేట, డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి మండలాలల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గుమ్మడి అమ్మకాలు జరుగుతుంటాయి. పోడు భూముల్లో సుమారు 130 ఎకరాల్లో గుమ్మడిని పండిస్తున్నారు. దాదాపు వంద టన్నుల మేర దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు.
● గుమ్మడికాయ సైజు బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు ధర పలుకుతోంది. లారీలు, వ్యాన్లు,ఆటోల్లో ఒడిశాలోని జయపురం, కోరాపుట్టు, కటక్, రాయఘడ్.మల్కన్‌గిరి తదితర ప్రాంతాల్లో వారపు సంతలకు తరలిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన వ్యాపారులు ఒడిశాలోని హోటళ్లు, రెస్టారెంట్లకు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. ఆదాయం బాగుండటంతో ఒడిశా రైతులు కూడా గుమ్మడి సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
సాగుపై ఆసక్తి
గుమ్మడికాయకు డిమాండ్ పెరిగింది. అందువల్ల సాగుపై ఆసక్తి పెరుగుతోంది. గతంలో ఇంటి అవసరాల కోసం మాత్రమే పంట వేసేవాళ్లం. ఒడిశా వ్యాపారులు సంతలకు వచ్చి అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో మంచి ఆదాయం వస్తోంది.
– జి.రాజారావు,
గిరిజన రైతు పనస, ముంచంగిపుట్టు మండలం
ఒడిశాలో కిలో రూ.60
వారపు సంతల్లో కొనుగోలు చేసి ఒడిశాలోని రెస్టారెంట్లు, హోటళ్లకు కిలో రూ.60 ధరకు విక్రయిస్తున్నాం. గుమ్మడి అధికంగా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే పండిస్తున్నారు. వీటిని వారపు సంతలకు తీసుకువచ్చిన గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాం. – వి.మహేష్‌పాడి,
గుమ్మడి వ్యాపారి, లంతాపుట్టు, ఒడిశా
వారపు సంతల్లో కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
గిరిజన రైతులకు కాయ సైజును బట్టి రూ.40 వరకు చెల్లింపు
ఒడిశాలో కిలోల చొప్పున విక్రయం