
గంజాయి నిర్మూలన అందరి బాధ్యత
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: గంజాయి వినియోగించడం సమాజానికి చేటని, గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో పలుశాఖల అధికారులతో గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటల సాగుపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతి నెలా నిర్వహించే సమావేశాలకు అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు. పోలీసు నిఘాతో పాటు ప్రతి చెక్‌పోస్టు వద్ద తనిఖీలను విస్తృతం చేయాలన్నారు.అన్నిశాఖలు ప్రణాళికలను రూపొందించుకుని గంజాయి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అన్ని విద్యాసంస్థల్లోను విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా గంజాయి వల్ల కలిగే అనర్థాలను సమగ్రంగా వివరించాలన్నారు. గంజాయి సాగుదారులు, సరఫరాదారులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి సాగు విడిచిపెట్టిన గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, స్వయం ఉపాధి పథకాలు, బ్యాంకుల రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. ఎస్పీ అమిత్‌బర్దర్ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణాదారుల స్థిర, చరాస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గంజాయి వ్యాపారులకు గిరిజన గ్రామాల్లో ఆశ్రయం కల్పించడం నేరమన్నారు. ఈ సమావేశంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వభరత్, పాడేరు డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ రామ్‌పడాల్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు, డీఆర్‌డీఏ పీడీ మురళీ, సీపీవో ప్రసాద్, ఎల్‌డీఎం మాతినాయుడు, జిల్లా ఉద్యానవన అఽధికారి బాలకర్ణ పాల్గొన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణపరిమితి పెంపు
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణపరిమితి పెంచాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్తపై సచివాలయాల స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. బిజినెస్ కరస్పాండెంట్లు, రైతు సేవా కేంద్రాల అధికారులు సమన్వయంతో బ్యాంకింగ్ లావాదేవీలపై రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుజేస్తున్న పలు రుణాల పథకాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని, ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు పొందిన భూములు, కాఫీ, మిరియం తోటల సాగుదారులకు రుణాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ కన్వీనర్ పి.సన్యాసిరాజా, ఆర్‌బీఐ లీడ్ జిల్లా అధికారి నవీన్, ఎల్‌డీఎం మాతునాయుడు, నాబార్డు డీడీఎం గౌరిశంకర్, డీఆర్‌డీఏ పీడీ మురళీ పాల్గొన్నారు.