
జలనిధికి కష్టకాలం
పాడైన రిటైనింగ్ వాల్
ముంచంగిపుట్టు: జిల్లాలోని మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలకు నీరందించడంలో జోలాపుట్టు జలాశయం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి నీరు రెగ్యులర్‌గా డుడుమ జలాశయం ద్వారా మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి సరఫరా అవుతోంది. ఇదికాకుండా దిగువనున్న జలవిద్యుత్ కేంద్రాలకు అవసరమైనప్పుడల్లా నేరుగా బలిమెల జలాశయానికి పంపిస్తుంటారు. మాచ్‌ఖండ్ విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదల అయ్యే నీరు కూడా బలిమెలకు వెళ్తుంది. ఇక్కడి నుంచి గుంటవాడ జలాశయం ద్వారా అప్పర్ సీలేరు వద్ద 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అక్కడ నుంచి ఆంధ్రా భాగస్వామ్యం మొదలై డొంకరాయి వద్ద 25 మెగావాట్లు, లోయర్ సీలేరు వద్ద 460 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం విడుదల అయిన నీరు గోదావరిలో కలుస్తుంది. దీనిని రబీలో డెల్టా సాగుకు వినియోగిస్తుంటారు. ఇలా కీలకమైన ప్రాజెక్ట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి.
1955లో జోలాపుట్టు ప్రాజెక్ట్ నిర్మించి నేటికి 70 ఏళ్లు అవుతోంది. నిర్వహణలోపం వల్ల డ్యామ్‌పై యంత్రాలు తుప్పుపట్టాయి. నీటిని విడుదల చేసే మార్గంలో షాంప్ వాల్‌కు సంబంధించిన ఐరెన్ , నీటి విడుదల చేసే నాలుగు గేట్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. అత్యవసర పరిస్థితిలో జలాశయ గేట్లు ఎత్తేటప్పుడు అధికారులకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
షాంప్ వాల్ మార్గంలో ఐరెన్ స్తంభాలు తుప్పు పట్టాయి. సిమెంటు దిమ్మల్లో కొన్ని పాడయ్యాయి. నీటిమట్టాన్ని కొలిచేందుకు వెళ్తున్న జలాశయ సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా జలాశయంలో పడిపోయే ప్రమాదం ఉంది.
డ్యామ్ దిగువ భాగంలో పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటుచేసిన సెక్యూరిటీ హౌస్ ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. చుట్టూ తుప్పులు అలుముకోవడంతో మూసుకుపోయింది.
ప్రాజెక్ట్ డ్యామ్ నాచుపట్టి ఉంది. చాలా సంవత్సరాల క్రితం రంగులు వేశారు. అప్పటినుంచి పట్టించుకోలేదు. డ్యామ్‌పై విద్యుత్ స్తంభాలపై లైట్లు పగిలిపోయాయి. వీటిని కూడా ప్రాజెక్ట్ అధికారులు పునరుద్ధరించలేదు. రాత్రి వేళల్లో అరకొరగా కొన్ని మాత్రమే వెలుగుతున్నాయి.
మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు చెందిన కాలువకు సుమారు 70ఏళ్లగా మరమ్మతులు చేయకపోవడం ఈ పరిస్థితి నెలకొంది. పవర్ గేట్లు పని చేయకపోతే వేసవి కాలంలో తనిఖీలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఏటా ప్రాజెక్ట్ నిర్వహణకు విడుదలయ్యే రూ.5 లక్షల నుంచి 10 లక్షల నిధులను నిర్వహణకు వినియోగిస్తే ప్రాజెక్ట్‌కు ముప్పు ప్రమాదం తప్పుతుందని పలువురు సూచిస్తున్నారు.
జిల్లాలోని నాలుగు జలవిద్యుత్
కేంద్రాలకు ఏడాది పొడవునా నీరు
అందించడంలో కీలకమైన జోలాపుట్టు జలాశయ నిర్వహణపై ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దులో సుమారు 242 గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ అతిపెద్దదిగా గుర్తింపు ఉంది. అయినప్పటికీ ప్రాజెక్ట్ నిర్వహణపై
ఇరు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే మార్గంలో రిటైనింగ్ వాల్ ఇటీవల వరద నీటి ఉధృతికి కోతకు గురైంది. డుడుమ జలాశయం పవర్ గేట్లు సక్రమంగా పనిచేయడం లేదు. గత ఆగస్టు రెండో తేదీన ప్రాజెక్టు ఉన్నతాధికారులు పరిశీలనలో భాగంగా రెండు గేట్లను ఎత్తారు. ఆ తరువాత అవి మూసుకోలేదు. దీంతో నీటి ఉధృతికి పవర్‌కెనాల్‌కు చెందిన రిటైనింగ్ వాల్ సుమారు 15 అడుగుల మేర కోతకు గురైంది. దీంతో డుడుమ ప్రాజెక్ట్ మార్గం ద్వారా ప్రాజెక్ట్‌కు నీరు సరఫఱాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు చోట్ల కెనాల్ గోడలకు రంధ్రాలు ఏర్పడి, నీరు వృథాగా పోతోంది.

జలనిధికి కష్టకాలం