
పత్రాలు సమర్పించకుంటే పశువులను గోశాలకు తరలిస్తాం
● తహసీల్దార్ త్రివేణి
డుంబ్రిగుడ: మండలంలోని కొర్రాయి గ్రామ సమీపంలో శనివారం రాత్రి తరలిస్తుండగా పట్టుబడిన పశువులకు సంబంధించి పత్రాలు సమర్పించకుంటే సింహాచలంలోని గోశాలకు తరలిస్తామని తహసీల్దార్ త్రివేణి తెలిపారు. నాలుగు లారీల్లో 104 పశువులను తరలిస్తుండగా పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ శనివారం రాత్రి అడ్డుకోవడం తెలిసిందే. పశువులను, లారీలను తహసీల్దార్‌కు అప్పగించి, తదుపరి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దార్ స్వాధీనం చేసుకున్న పశువులను పశుసంవర్థకశాఖ అధికారులకు ఆదివారం అప్పగించారు. పోలీసుల సహకారంతో విచారణ నిర్వహించారు. నివేదికను పీవో తిరుమణి శ్రీపూజకు సమర్పించినట్టు ఆమె తెలిపారు. పశువులకు దాణా అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఈ సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు. వీఆర్వో సత్యనారాయణ, వీఏవో బాలకృష్ణ పాల్గొన్నారు.