
ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
● నేడు అరకువ్యాలీ, రేపు చింతపల్లిలో నిర్వహణ ● డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నీలవేణి
చింతపల్లి: జిల్లాలోని ఏరియా ఆస్పత్రుతలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎం. నీలవేణి తెలిపారు. ఆదివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. వచ్చేనెల రెండో తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో వైద్య శిబిరాలు జరుగుతాయన్నారు. ఈ నెల 22న అరకులోయ, 23న చింతపల్లి, 25న రంపచోడవరం ఏరియా ఆస్పత్రులు, 27న కూనవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీటిలో ప్రత్యేక వైద్యనిపుణులు మహిళలకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రధానంగా రక్తపోటు, మధుమేహం, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు, క్షయ తదితర వాటికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పోషణ అభియాన్ సమతుల్య ఆహారం, తల్లీబిడ్డల సేవలు, వయోవృద్ధులు, ఆయుష్ సేవలతో పాటు కిషోర బాలికలకు అందించే ఆరోగ్య సేవలపై అవగాహన కల్పిస్తారని ఆమె పేర్కొన్నారు. .