
విద్యారంగ సమస్యల పరిష్కారానికి బస్సు యాత్ర
అల్లిపురం (విశాఖ): రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 14 నుంచి నవంబర్ 14 వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నెల రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు తెలిపారు. ఆదివారం అల్లిపురం సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న రూ. 6400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3400కు పైగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు శేఖర్, కోశాధికారి భవాని, సహాయ కార్యదర్శిలు కె.మౌనిక, హేమానందం, ఉపాధ్యక్షుడు కిరణ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.