
లభించని గిరిజనుడి ఆచూకీ
● మత్స్యగెడ్డలో తీవ్రంగా గాలించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
మత్స్యగెడ్డలో గాలిస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సభ్యులు
ముంచంగిపుట్టు: చేపల వేట చేస్తూ మండలంలోని వనుగుమ్మ పంచాయతీ దొమినిపుట్టు వద్ద మత్స్యగెడ్డలో గల్లంతైన నర్సింగ్(28) అనే గిరిజనుడి ఆచూకీ సోమవారం కూడా లభించలేదు. స్థానిక గిరిజనులు నాటు పడవలతో గాలింపు జరిపినా జాడ కానరాలేదు. దీంతో కలెక్టర్ చొరవతో సోమవారం విశాఖపట్నానికి చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు దొమినిపుట్టు గ్రామానికి చేరుకుని గాలింపు జరిపాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌కి చెందిన 15మంది ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రాంతమంతా విస్తృతంగా గాలించారు. దొమినిపుట్టు, కోసంపుట్టు, పట్నపడాల్‌పుట్టు గ్రామాల గిరిజనులు సైతం బృందాలకు సహకారం అందిస్తూ నాటు పడవలతో గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. మళ్లీ మంగళవారం ఉదయం నుంచి గాలింపు జరుపుతామని అధికారులు తెలిపారు. రెవెన్యూ,పోలీలు శాఖల అధికారులు గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన నర్సింగ్ కుటుంబ సభ్యులు, బంధువులు, పరిసర గ్రామాల గిరిజనులు అధిక సంఖ్యలో ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని రోదిస్తూ వేచి చూశారు.