
నేడు ఉపమాకలో వైష్ణవ కృష్ణాష్టమి
నక్కపల్లి (అనకాపల్లి): ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమ, మంగళవారాల్లో వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఆలయంలో నిత్యపూజా కార్యక్రమాలు, బాలభోగ నివేదనలు, నిత్య హోమాలు, తీర్థగోష్టి, యథావిధిగా జరుగుతాయన్నారు. కృష్ణ పరమాత్మకు ఉగ్గుపాలు పడుతున్నట్టు గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు యశోదాదేవి అలంకరణ చేస్తారని చెప్పారు. సాయంత్రం ఆలయంలో విశేష అలంకరణలో ఉన్న యశోదాదేవికి, శ్రీదేవి భూదేవి సమేత కల్కి వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు, ఆలయ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి నీరాజనాలు సమర్పించిన తర్వాత భక్తులందరికీ విశేష ప్రసాద నివేదన ఉంటుందన్నారు. అనంతరం గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తమై వెలసిన మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం, విశేష ప్రసాద నివేదనలు, తీర్థగోష్టి నిర్వహిస్తామన్నారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఆస్థాన మండపంలో ఉభయ దేవేరులతో కూడిన స్వామివారి ఉత్సవమూర్తులను, బుల్లి కృష్ణుడిని స్వామివారి పీఠంపై అధిష్టింపజేసి ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వెన్నతో కూడిన ఉట్టికి ప్రత్యేక ఆరాధనలు అనంతరం, ఏకాంతంగా ఉట్టి కొట్టే సంబరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.