కేజీహెచ్‌కు జబ్బు | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌కు జబ్బు

Sep 8 2025 5:52 AM | Updated on Sep 8 2025 5:52 AM

కేజీహ

కేజీహెచ్‌కు జబ్బు

● వార్డుల్లో అధ్వాన పరిస్థితులు ● కంపుకొడుతున్న మరుగుదొడ్లు ● అపరిశుభ్రంగా ఆస్పత్రి పరిసరాలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం

మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌ సమస్యలకు నిలయంగా మారింది. వ్యాధి నయం చేసుకుందామని వచ్చే రోగులు.. ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులతో మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఓపీ టికెట్‌ కోసం నిరీక్షణతో మొదలయ్యే ఈ నరకం.. వార్డులో చేరిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు పెంచకపోగా.. ఉన్నవి కూడా కనీస స్థాయిలో లేకపోవడంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది.

ఓపీ నుంచి వార్డు వరకు అవస్థలే

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతిరోజూ 1,500 నుంచి 2,200 మంది వరకు ఓపీ నమోదవుతోంది. 300 నుంచి 600 మంది ఇన్‌–పేషెంట్లుగా చేరుతుంటారు. అయితే 1,187 పడకలున్న ఈ ఆస్పత్రిలో రోగుల ప్రవేశం నుంచే కష్టాలు మొదలవుతాయి. ఓపీ టికెట్టు కోసం గంటలకొద్దీ క్యూలో నిలబడాలి. ఆ తర్వాత వైద్యుడిని కలవడానికి మరో గంటకు పైగా నిరీక్షించక తప్పదు. క్యాజువాలిటీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్‌, ప్రసూతి, చిన్నపిల్లల వార్డులతో సహా ప్రతి విభాగంలోనూ రోగుల బారులు తీరిన దృశ్యాలు సర్వసాధారణం. వైద్యుల కొరత ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.

మందుల కొరతతో మరో గండం

గతంలో 30 రోజులకు సరిపడా మందులు ఇచ్చే చోట.. నేడు కేవలం వారానికి సరిపడా మందులతోనే సరిపెడుతున్నారు. దీంతో రోగులు ప్రతి వారం మందుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. ఫార్మసీ కౌంటర్లలో మొత్తం 600 రకాల మందులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 500 రకాలే అందుబాటులో ఉన్నాయి. వైద్యులు రాసిన చీటీలో ఆరు మందులుంటే.. మూడు మాత్రమే ఇచ్చి మిగతావి బయట కొనుక్కోవాలని సిబ్బంది చెబుతున్నారు. ఉచిత వైద్యం కోసం వచ్చే పేదలకు ఇది పెను భారంగా మారింది.

కొరవడిన పర్యవేక్షణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్పత్రిలో పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, వైద్య సేవలు క్షీణించాయని రోగులు ఆరోపిస్తున్నారు. గతంలో అందిన స్థాయిలో కూడా ఇప్పుడు సేవలు అందడం లేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని వాపోతున్నారు. ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వాల్సిన ఆస్పత్రే ఇలా రోగగ్రస్తంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేజీహెచ్‌లో ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మరుగుదొడ్లలో ట్యాప్‌లు లేని కుళాయిలు,

తలుపుల్లేని మరుగుదొడ్లు

పారిశుధ్యం అస్తవ్యస్తం

ఆస్పత్రిలోని చాలా వార్డులు అపరిశుభ్రతకు అడ్డాగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతోంది. ఇక మరుగుదొడ్ల పరిస్థితి మరింత అధ్వానం. చాలా కుళాయిలకు ట్యాప్‌లు లేకపోవడంతో నీరు నిరంతరం వృధాగా పోతోంది. దీంతో రోగులు, వారి సహాయకులు వాటర్‌ బాటిళ్లతో వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల రోగులు కుక్కలతో కలిసి ఉండాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగా పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది.

పనిచేయని పరికరాలు

కేజీహెచ్‌లో వైద్య పరికరాల లభ్యత కూడా పెద్ద సమస్యగా మారింది. రోగులను ల్యాబ్‌కు, సీటీ స్కాన్‌, ఎక్స్‌రే వంటి పరీక్షలకు తీసుకెళ్లడానికి వీల్‌చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రోగుల బంధువులే వారిని మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఆస్పత్రిలోని 217 ఏసీలకు గాను 90 మరమ్మతులకు గురయ్యాయి. కీలకమైన ఆర్టీరియల్‌ బ్లడ్‌ గ్యాస్‌ (ఏబీజీ) పరీక్షలకు అవసరమైన రీజెంట్స్‌ లిక్విడ్‌ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా 16 మిషన్లు మూలనపడ్డాయి. దీంతో కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 26 కిపైగా విభాగాలున్నాయి. పెరుగుతున్న రోగులు సంఖ్యకు అనుగుణంగా వార్డులు, పడకల సంఖ్య పెంచాల్సి ఉండగా ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు.

కేజీహెచ్‌కు జబ్బు1
1/3

కేజీహెచ్‌కు జబ్బు

కేజీహెచ్‌కు జబ్బు2
2/3

కేజీహెచ్‌కు జబ్బు

కేజీహెచ్‌కు జబ్బు3
3/3

కేజీహెచ్‌కు జబ్బు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement