
హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలి
హుకుంపేట: భూర్జ పంచాయతీ పరిధిలోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనరస, గిరిజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర హెచ్చరించారు. మంగళవారం మండలంలోని భూర్జలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. అనుమతులు రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా అప్పలనరస, సురేంద్ర మాట్లాడుతూ ఆదివాసీ సమాజాన్ని సమాధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయన్నారు. టైగర్ జోన్ పేరిట ఆదివాసీలను అడవుల నుంచి తరిమేయాలని చూస్తున్నాయన్నారు. పోడు వ్యవసాయదారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5వ షెడ్యూల్ భూ భాగాన్ని అప్పనంగా నవయుగ,అదాని కంపెనీలకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఏజెన్సీలో హైడోర పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతుల ఇచ్చారన్నారు. వీటిని తూచతప్పకుండా రాష్ట్రంలో కూటమి ప్రతినిధులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యంగం ద్వారా ఆదివాసీలకు సంక్రమించిన ప్రత్యేక హక్కులు, చట్టాలపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజన సంఘం నాయకులు తాపుల కృష్ణారావు, ఎంపీటీసీ మజ్జి హరి, సర్పంచ్ మొత్తి పాల్గొన్నారు.
లేకుంటే ఉద్యమం తీవ్రతరం
సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనరస, గిరిజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర హెచ్చరిక
భూర్జలో సభకు భారీగా తరలివచ్చిన గిరిజనం