
ఆశ్రమాల్లో గిరిజన విద్యార్థులకు భద్రత కరువు
రంపచోడవరం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్ధులకు కనీస భద్రత కరువైందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగుపల్లి ధనలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విడేల వివేకనందరెడ్డి సీతపల్లి వాగులో పడి ప్రాణాలు కోల్పోవడంతో విద్యార్థి మృతదేహాన్ని రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఆమె పరిశీలించారు. మృతుడు తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టల్ సిబ్బంది విద్యార్థుల పట్ల కనీస బాధ్యత లేకుండా ఉంటున్నారని ఆరోపించారు. వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చూసుకోవడానికి ఏఎన్‌ఎంలు అందుబాటులో లేరన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థుల పట్ల, ఆశ్రమ పాఠశాలల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
ఆస్పత్రి ఆవరణలో ఆందోళన
విద్యార్థి వివేకానందరెడ్డి మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే నాగుపల్లి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఆస్పత్రి ఆవరణలో వామపక్ష నాయకులు లోతా రామారావు, మట్ట వాణిశ్రీ, పల్లాల లచ్చిరెడ్డి, వెదుళ్ల లచ్చిరెడ్డితో కలిసి బైఠాయించి ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఏరియా ఆస్పత్రికి వచ్చి విద్యార్థి మృతిపై సమాధానమివ్వాలన్నారు. దీంతో ఆస్పత్రి వద్దకు వచ్చిన డీడీ రుక్మాండయ్య వారితో మాట్లాడారు. తక్షణ సహాయంగా రూ. 50వేలు అందజేస్తామని, విద్యార్థి కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ద్వారా నెలకు రూ.6వేల చొప్పున ఐటీడీఏ చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, సర్పంచ్ మంగా బొజ్జయ్య, పార్టీ నాయకులు పండా రామకృష్ణదొర, బొబ్బా శేఖర్, జల్లేపల్లి రామన్నదొర,ఎంపీటీసీ ఉలవల లక్ష్మి, వంశీ, రూతూ పాల్గొన్నారు.
తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే
ధనలక్ష్మి ధ్వజం
వాగులోపడి మృతి చెందిన విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్
ఏరియా ఆస్పత్రి ఎదుట వామపక్ష నేతలతో కలిసి బైఠాయింపు

ఆశ్రమాల్లో గిరిజన విద్యార్థులకు భద్రత కరువు