
దారిదోపిడీ కేసులో నిందితుల అరెస్టు
పాడేరు : జిల్లాలో సంచలనం సృష్టించిన దారిదోపిడీ కేసును జిల్లా పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదివారం తన కార్యాలయంలో వెల్లడించారు. గత నెల 31న పెదబయలు మండలం బొండపల్లి గ్రామ సచివాలయానికి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ కఠారి మత్య్సరాజు పెదబయలు ఎస్‌బీఐ బ్యాంకులో రూ.15.62 లక్షల పింఛను సొమ్ము తీసుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో బంగారుమెట్ట సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి అతనిని మారణాయుధాలతో బెదిరించి అడ్డుకున్నారు. అతని వద్ద ఉన్న పింఛను సొమ్మును పట్టుకుపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు ముంచంగిపుట్టు ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసరావు దర్యాప్తు వేగవంతం చేశారు. ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు గ్రామంలో ఒడిశాకు చెందిన కుమార్ మహాపాత్రో(28), వికాస్ కొర(25) దురై(19) డబ్బులు పంచుకుంటున్నట్లు సమాచారం సేకరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పింఛను సొమ్ము అపహరించినట్టు వారు అంగీకరించడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.15.62లక్షల నగదు, బెదరించేందుకు వినియోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దారిదోపిడీ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, ముంచంగిపుట్టు, అరకు,పెదబయలు ఎస్‌ఐలు రామకృష్ణ, గోపాలరావు, రమణలతో పాటు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సహబాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
నగదు పంచుకుంటుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఒడిశాకు చెందిన ముగ్గురిని
రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దర్
చాకచక్యంగా కేసును ఛేదించిన సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందికి రివార్డులు

దారిదోపిడీ కేసులో నిందితుల అరెస్టు