
వణికిస్తున్న మలేరియా
● చాపకింద నీరులా విజృంభణ ● గ్రామాల్లో కొరవడిన పారిశుధ్యం ● పెరుగుతున్న దోమల వ్యాప్తి ● ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెరుగుతున్న జ్వర పీడితులు ● రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో 1,398 కేసుల నమోదు ● విలీన మండలాల్లో 151 హాట్‌స్పాట్లు గుర్తింపు
చింతూరు: రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో మలేరియా జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,398 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో రంపచోడవరం డివిజన్లో 883 , చింతూరు డివిజన్లో 515 కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ అధికారవర్గాలు తెలిపాయి.
● వాతావరణ మార్పులు, గ్రామాల్లో పారిశుధ్యం కొరవడటం తదితర కారణాల వల్ల దోమలు వృద్ధి చెంది, మలేరియాను వ్యాప్తి చేస్తున్నాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గ్రామాలు చిత్తడిగా మారడం వల్ల దోమల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపర్చడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహిస్తునారన్న విమర్శలు ఉన్నాయి. చెత్త, చెదారంతో నిండిపోవడం, నీటి మడుగులు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మలేరియా దోమల లార్వా వ్యాప్తికి దోహదపడుతున్నాయి. గ్రామాల్లో దోమల నివారణకు స్ప్రేయింగ్, ఫాగింగ్, డ్రైనేజీలను శుభ్రం చేయడం, చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లించడంలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విలీనంలో 151 హాట్ స్పాట్ల గుర్తింపు
మలేరియా కేసులు అధికంగా నమోదయ్యేందుకు అవకాశమున్న 151 హాట్‌స్పాట్ కేంద్రాలను చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో గుర్తించినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. గతేడాది రెండు కంటే ఎక్కుఇవగా మలేరియా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి యాంటీలార్వా, ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటి కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. చింతూరు మండలంలో 64, వీఆర్‌పురం మండలంలో 39, ఎటపాక మండలంలో 21, కూనవరం మండలంలో 26 ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు.
పీహెచ్‌సీల వారీగా..
చింతూరు డివిజన్లో ఈ ఏడాది పీహెచ్‌సీల వారీగా తులసిపాకలో 96, మోతుగూడెం 126, ఏడుగురాళ్లపల్లి 75, కూటూరు 64, రేఖపల్లి 45, జీడిగుప్ప 44, కూనవరం 27, గౌరిదేవిపేట 17, నెల్లిపాక 15, లక్ష్మీపురం ఆరు కేసులు నమోదయ్యాయి.

వణికిస్తున్న మలేరియా

వణికిస్తున్న మలేరియా