
గిరిజన హక్కులు, చట్టాలను పరిరక్షించాలి
పాడేరు : గిరిజనుల హక్కులు, చట్టాలను రక్షణ
కల్పించి వాటిని పరిరక్షించి అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్‌ఎస్ సన్యాసినాయుడు సూచించారు. పట్టణంలోని కాఫీ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, గిరిజన ప్రాంత పారా లీగల్ వలంటీర్లు, ప్యానల్ అడ్వకేట్లు, గిరిజన యువతకు శుక్రవారం న్యాయసేవలపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అమిత్‌బర్దర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, దామోదర సంజీవయ్య న్యాయ కళాశాల వైస్ చాన్సలర్ సూర్యప్రకాష్‌తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. వాటికి కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏ సమస్య వచ్చినా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తే సమస్యలను సునాయంగా అధిగమించవచ్చన్నారు. న్యాయ సేవలపై గిరిజనులు అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో గిరిజనులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలని గిరిజన ప్రాంత పారా లీగల్ వలంటీర్లకు సూచించారు. గిరిజన ప్రాంతంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
ఎస్పీ అమిత్‌బర్దర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జ్యుడీషియల్ సిస్టం ఉందన్నారు. భారతీయ సంస్కృతిలో గిరిజన సంస్కృతి చాలా కీలకమన్నారు. సమాజంలో, సంఘంలో ఉండే ప్రతి పౌరుడితో సామరస్యంగా స్నేహభావంతో ఉండాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయం కావాలంటే కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, దామోదర సంజీవయ్య న్యాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ సూర్యప్రకాష్ అటవీ హక్కులు, స్థానిక భాషలు, గిరిజనుల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీ ఆర్. శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీభాయ్, జిల్లా కార్మిక శాఖ అధికారి సుజాత, డీఈవో బ్రహ్మాజీరావు, డ్వామా పీడీ విద్యాసాగర్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరిపై బాధ్యత
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు భద్రత అవసరం
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి
ఆర్‌ఎస్ సన్యాసినాయుడు

గిరిజన హక్కులు, చట్టాలను పరిరక్షించాలి