
బంగాళాఖాతం నీటి తీరు బాగోదు.. అందుకే క్రూయిజ్ రాదు.!
● విశాఖ ఎంపీ భరత్ వింత వాదన ● బంగాళాఖాతంతో పోలిస్తే అరేబియా రఫ్ సీ ● క్రూయిజ్ మార్గానికి ఈ ప్రాంతం అనువైనదే.. ● ఈ విషయం తెలియకుండానే అంతర్జాతీయ టెర్మినల్ నిర్మించామా.? ● విశాఖ పోర్టు వర్గాలు గుసగుసలు
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతం, అరేబియా సముద్రం.. ఈ రెండింటిలో రఫ్ సీ(అలజడి) ఏదని అంటే.. అరేబియా సముద్రమేనని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. కానీ విశాఖ ఎంపీ భరత్ మాత్రం వింత వాదన తెరపైకి తీసుకొచ్చారు. క్రూయిజ్ టెర్మినల్ దగ్గర సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులతో పాటు ఎంపీ భరత్ సమాధానాలిచ్చారు. ‘రూ.100 కోట్లు వెచ్చించి క్రూయిజ్ టెర్మినల్ నిర్మించారు. కానీ దానికి రెగ్యులర్‌గా క్రూయిజ్ షిప్‌లు రావడం లేదెందుకు..?’ మీడియా ప్రతినిధులు అడగ్గా.. ‘బంగాళాఖాతం కాస్తా రఫ్ సీ గా ఉంటుంది. ఇక్కడ నీటి కదలికలు ఈ తరహా షిప్స్ ప్రయాణాలకు అనుకూలంగా ఉండవు. అందుకే రెగ్యులర్‌గా రావడం లేదు’.. అని ఎంపీ భరత్ సమాధామిచ్చారు. ఇది విన్న విశాఖ పోర్టు వర్గాలు ఆశ్చర్యపోయాయి. వాస్తవానికి పక్కనే ఉన్న అరేబియా సముద్రంతో పోలిస్తే.. బంగాళాఖాతం చాలా వరకూ ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది నిత్యం అలజడిగా ఉండే అరేబియా సముద్ర పరిధిలో ఉన్న ముంబై, గోవా, లక్షద్వీప్ మొదలైన ప్రాంతాలకు క్రూయిజ్ సర్వీసులు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. కానీ విశాఖకు క్రూయిజ్ రాకపోవడం బంగాళాఖాతం అలజడిగా ఉండటమేనని ఎంపీ చెప్పడంపై అక్కడే ఉన్న పోర్టు వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి సముద్ర నీటి అలల స్థితిగతులు, డిమాండ్, వాతావరణ పరిస్థితులు మొదలైన అంశాలపై దాదాపు ఏడాది పాటు అధ్యయనం చేసి.. నివేదిక ఇచ్చిన తర్వాతే అడుగు పడింది. క్రూయిజ్ షిప్స్ తిరిగేందుకు బంగాళాఖాతం అనువైనదని కేంద్ర ప్రభుత్వం ధృవీకరించిన తర్వాతే.. టెర్మినల్ నిర్మాణ పనులకు చేపట్టారు. కానీ ఇప్పుడు ఎంపీ ఇలా మాట్లాడడంపై పోర్టు వర్గాలు ముక్కున వేలేసుకున్నాయి. రూ.100 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ టెర్మినల్ నిర్మించినప్పుడు ఇవన్నీ తెలుసుకోకుండానే జరుగుతుందా? అని అవాక్కయ్యారు.