
ఫిట్స్‌తో విద్యార్థికి తీవ్ర అస్వస్థత
● కేజీహెచ్‌కు తరలింపు ● మెరుగైన వైద్యం అందిస్తాం: ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్
కొయ్యూరు: బూదరాళ్ల పంచాయతీ చీడిపల్లికి చెందిన విద్యార్థి మర్రిశెట్టి సత్తిబాబు(12) తీవ్ర జ్వరంతో ఫిట్స్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సోమవారం రాజేంద్రపాలెం ఆస్పత్రి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వైద్యుల సూచనల మేరకు విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఆదివార మధ్యాహ్నం సత్తిబాబుకు జ్వరం వచ్చి పడిపోయాడని, అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తక్షణమే 108 సమాచారం అందించారు. గ్రామానికి సరైన దారి లేకపోవడంతో 108 చేరుకోలేకపోయిందని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో సోమవారం ఉదయం పిడుగురాయికి చెందిన ఓ ప్రైవేట్ జీపు ద్వారా సత్తిబాబును రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం వైద్యుల సూచనల మేరకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయంపై ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్ మాట్లాడుతూ కేజీహెచ్‌లోని ట్రైబల్ సెల్ నిర్వాహకులతో మాట్లాడి సత్తిబాబుకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.