
దిగజారిన ధరలు.. రైతుల దిగాలు
● వారపు సంత మార్కెట్‌లో వేరుశనగకు తగ్గిన రేటు ● గత వారం కంటే సగానికి పైబడి పడిపోయిన ధర
పెదబయలు: గిరిజన రైతులు వాణిజ్య పంటల్లో లాభదాయక పంటల్లో వేరుశనగ పంట ప్రధానంగా పండిస్తున్నారు. మత్స్యగెడ్డ గెడ్డ పరివాహక ప్రాంతాలు. ఇతర గెడ్డలను ఆనుకున్న పంచాయతీల్లో ఎక్కువగా వేరుశనగ సాగు చేస్తున్నారు. పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే పండిస్తున్న పంట కావడంతో మన్యం వేరుశనగకు మంచి గిరాకీ ఉంది. గతంలో కాసుల వర్షం కురిపించిన ఈ పంట కూటమి ప్రభుత్వంలో అధికారులు, జీసీసీ సహాయ సహకారాలు లేక వారపు సంత మార్కెట్‌లో కొనేవారు లేక గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్‌బీకే కేంద్రాలు, జీసీసీ, మార్కెట్ కమిటీ, స్వచ్ఛంద మార్కెట్ ద్వారా బస్తా వేరుశనగ రూ.2700 నుంచి రూ.2800 వరకు ధర పలికితే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వేరుశనగ ధర క్రమంగా తగ్గుతూ వస్తుంది. గత ఏడాది ఈ సీజన్‌లో రూ.1800 నుంచి రూ.2000 వరకు ధర పలికింది. ఈ ఏడాది వేరుశనగ సీజన్‌లో రూ.1400 నుంచి 1800 వరకు పలికింది. అయిత గత వారం కూడ రూ.1600 వరకు ధరపలికిన వేరుశనగ ఈ వారం రూ.700 నుంచి రూ.800 వరకు ధరతో వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. వారపు సంతలో రోజంతా నిరీక్షణ చేసి తక్కువ ధరకు అమ్ముకుని వెల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వ్యాపారుల సిండికేట్
గిరిజన రైతులు పండించిన వేరుశనగ రాజమండ్రి, అనకాపల్లి, తుని, నర్సీపట్నం, విజయనగరం తదితరు ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి సంతల్లో కొనుగోలు చేస్తారు. అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో వారు నిర్ణయించిన ధరలకే విక్రయించుకోవాల్సి వస్తోందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారపు సంత మార్కెట్‌కు అమ్మకానికి తెచ్చి మరలా రైతు తిరిగి తీసుకుని వెల్లే పరిస్థితి లేకపోవడం, మరో మార్కెట్ సదుపాయం లేకపోవడంతో సిండికేట్ వ్యాపారులకు అనుకూలంగా మారుతోందని రైతులు చెబుతున్నారు. గత్యంతరం లేక తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతుకు ఏర్పడుతుందని వాపోతున్నారు. వారపు సంతకు రవాణా చార్జీలు, కూలీ డబ్బులు కూడా రావడం లేదంటున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రైతు కష్టాలు పట్టని ప్రభుత్వం
గిరిజన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. వారపు సంత మార్కెట్‌లోనే పండించిన పంటలు అమ్మకం చేస్తాము. అన్ని పంటలు పసుపు, పిప్పళ్లు, ఇతర పంటలు మాదిరిగానే వ్యాపారుల సిండికేట్ వేరుశనగ పంటపై కూడా పడింది. సంతలో ధరలు వారం వారం మార్పు చెందుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. సంతలో జరిగే మోసాలు అరికట్టడానికి ప్రభుత్వం,అధికారులు దృష్టి సారించడం లేదు. ఇప్పటికై నా స్పందించి రైతులను ఆదుకోవాలి.
– దడియా రామచందర్, రైతు, పెదబయలు గ్రామం, పెదబయలు మండలం
గిట్టుబాటు ధర కల్పించాలి
గత వారం పెదబయలు వారపు సంతలో బస్తా రూ.1600 ధరతో కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ వారం రూ. 800లకు కూడా కొనుగోలు చేయడం లేదు. పంట పెట్టుబడి, కూలీ రేట్లు కూడా రావడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేరుశనగ పంట కొనుగోలులో ఆర్‌బీకేలు, మార్కెట్ కమిటీ సహకారంతో వ్యాపారులు గ్రామాలకు వచ్చి మంచి ధరలు ఉండేవి. నేడు అధికారుల పర్యవేక్షణ లేదు. సిండికేట్ వ్యాపారుల బెడద ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రెండు రెండు ఎకరాల్లో సాగు చేశాను. ధర లేదు. ప్రభుత్వం గిరిజన రైతులు పండించిన పంటలకు గిట్టుబాబు ధర కల్పించాలి.
– కిముడు సన్యాసి, రైతు, తమరడ గ్రామం, పెదబయలు మండలం

దిగజారిన ధరలు.. రైతుల దిగాలు

దిగజారిన ధరలు.. రైతుల దిగాలు