
అల్లూరి వాడలో...అవకాడో
● సాగు విస్తీర్ణం పెంచేందుకు సన్నాహాలు ● అనుకూల అంశాలపై సర్వే ● ఈ ఏడాది జిల్లాలో 250 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు ● సాగుకు ముందుకు వస్తున్న రైతులు
జిల్లాలో అవకాడో సాగు పెంపే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సాగుకు అనుకూలమైన అంశాలపై హెచ్‌ఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సర్వే చేస్తూ, ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరో వైపు రైతులు కూడా ముందుకు వస్తుండడంతో మొక్కలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రంపచోడవరం: జిల్లాలో మారేడుమిల్లి మండలం సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడంతో ఇక్కడ వాతావరణం బయట ప్రాంతం కంటే శీతలంగా ఉంటుంది. శీతల ప్రాంతంలో పండే పంటలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో రబ్బరు, కాఫీ, మిరియాలు తదితర పంటలను రైతులు పండిస్తున్నారు. అవకాడో మొక్కలను ఎక్కువగా పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉద్యానవన శాఖ అధికారులను తాజాగా కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. దీనిలో భాగంగా వై.రామవరం ఎగువ ప్రాంతం, మారేడుమిల్లి ప్రాంతాల్లో అవకాడో మొక్కలు పెంచేందుకు గ్రామాలను ఎంపిక చేసి, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అవకాడో ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న ఖరీదైన పండు. ఆరోగ్యానికి మేలు చేసే ఇది విదేశాల్లో ఎక్కువగా పండుతోంది. ప్రస్తుతం మన దేశంలో తూర్పు హిమాలయ ప్రాంతంతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు,మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మాత్రమే సాగులో ఉంది. ఇప్పటికే జిల్లాలో పాడేరు, అరకు ప్రాంతాల్లో అవకాడో మొక్కలను గిరిజన రైతులకు పంపిణీ చేస్తున్నారు. గొందిపాకలు, పెద్దబరడ గ్రామాల్లో రైతులు అవకాడో సాగు ప్రారంభించారు. మారేడుమిల్లి, వై.రామవరం అప్పర్ పార్ట్ అవకాడో సాగుకు అనుకూలంగా ఉంటుంది. సాగుకు పొడి వాతావరణం ఉండాలి. ఈ చెట్లకు ఎక్కువ నీరు, ఎక్కువ చల్లదనం ఉండకూడదు. ఈ ప్రాంతంలో ఇలాంటి వాతావరణం ఉండడంతో అవకాడో సాగుకు అనువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాగుపై విస్తృత సర్వే
ఏజెన్సీ ప్రాంతంలో అవకాడో సాగుకు అనుకూలమైన అంశాలపై విస్తృతంగా సర్వే చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలోఎవరైనా రైతులు అవకాడో సాగు చేస్తున్నారా, వాతారణం, వర్షపాతం వంటి విషయాలపై ఇప్పటికే డాక్టర్ వైఎస్సార్ హార్టీ కల్చర్ యూనివర్సిటీ నుంచి నివేదికలు ఇచ్చాం. ఈ ఏడాది కొంత మంది రైతులకు అవకాడో మొక్కలు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం.
–డాక్టర్ పి.సి. వెంగయ్య, హెచ్‌ఆర్‌ఎస్ అధిపతి,సీనియర్ శాస్త్రవేత్త, పందిరిమామిడి,