
వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తం
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
పాడేరు: గోదావరి, శబరి నదుల వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. సోమవా రం తన కార్యాలయం నుంచి ఎటపాక, కూనవరం, చింతూరు,వీఆర్‌పురం ఎంపీడీవోలు, తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదలకు ఎటువంటి ప్రాణనష్టం జరగకూడదన్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు చెప్పారు. గోదావరికి ప్రథమ హెచ్చరిక, శబరి నదికి మొదటి, రెండో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు ముందస్తు చర్యలు చేపట్టి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.