సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు
అరకులోయ టౌన్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు అని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షి టీవీ డిబేట్‌లో విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేనిపై కేసు ఎలా పెడతారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించిందన్నారు. కొమ్మినేనికి, సాక్షి టీవీకి ఎటువంటి సంబంధం లేకపోయినా వాటిని ఆపాదిస్తూ టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టించారని అన్నారు. కుట్రపూరితంగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడి చేశారని, తక్షణమే వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడాది కూటమి పాలనలో అక్రమ అరెస్టులు, కేసులతో నియంత పాలన సాగుతోందని, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో కనీస నిబంధనలు పాటించలేదన్న విషయం సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం వదిలి, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, వైఎస్సార్‌సీపీ నేత కిరణ్ పాల్గొన్నారు.
సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి..
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


