● జిల్లావ్యాప్తంగా ఎనిమిది నెలల క్రితం బీసీ, కాపు కార్ప
కొయ్యూరు: సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుందామని, ప్రభుత్వ సాయంతో కాళ్ల మీద నిలబడదామని ఆశపడిన బీసీ, కాపు యువతకు నిరాశే మిగిలింది. స్వయం ఉపాధి పేరిట ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకు పరిమితమయ్యాయి. కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేయడం, దరఖాస్తుల స్వీకరణ, ఇంటర్వ్యూల నిర్వహణ వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసిన ప్రభుత్వం.. చివరకు నిధుల విడుదలలో మొండిచేయి చూపిందని విమర్శిస్తున్నారు.
● బీసీ, కాపు కార్పొరేషన్ల రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఏప్రిల్‌లో ఇచ్చింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేనెలలో జిల్లావ్యాప్తంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటి దరఖాస్తులను సంబంధిత కార్పొరేషన్లకు మండల పరిషత్ అధికారులు పంపించారు. అక్కడి నుంచి ఏమైందో తెలియని పరిస్థితి నెలకొనడంతో దరఖాస్తులు నిరాశకు గురయ్యారు.
● రూ.లక్ష నుంచి ఐదు లక్షల విలువైన యూనిట్లకు దరఖాస్తు చేసిన వారు కొన్ని రోజుల పాటు బ్యాంకు మేనేజర్లను ప్రసన్నం చేసుకున్నారు. వారు అనుమతి ఇస్తేనే రుణం మంజూరవుతుంది. అటు ఆయా కార్పొరేషన్ల నుంచి రాయితీ వస్తుంది.అయితే బ్యాంకర్లు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పడంతో వారు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన చెందుతున్నారు.అప్పట్లో బీసీ,కాపులకు మాత్రమే అవకాశం రావడంతో గిరిజనులు అసంతృప్తి చెందారు. వారికి కూడా త్వరలో నోటిపికేషన్ వస్తుందని ప్రచారం జరిగినా ఫలితం లేకపోయింది.
ఇంటర్వ్యూకు వెళ్లా
కాపు కార్పొరేషన్ ద్వారా వచ్చే యూనిట్‌కు దరఖాస్తు చేశా. ఇంటర్వ్యూకు హాజరయ్యా. ఇంత వరకు దీనిపై ఎలాంటి సమాచారం రాలేదు. వస్తే స్వయం ఉపాధితో డెయిరీ పెట్టుకోవాలని చూస్తున్నా.
– బీఎల్ నాగేశ్వరరావు,
నిరుద్యోగి, సింగవరం
ఆదేశాలు రాలేదు
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించాం. దీనికి సంబంధించి ఆయా కార్పొరేషన్ల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆ సైట్‌ను మూసివేశారు. తిరిగి ఆదేశాలు వస్తేనే ప్రక్రియ ప్రారంభించగలం.
– శంకర్రావు, ఈడీ,
బీసీ కార్పొరేషన్, విశాఖపట్నం


