విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
● ప్రయాణికులకు స్వల్పగాయాలు
● డొంకరాయి జెన్‌కో ఆస్పత్రికి తరలింపు
● అదుపు తప్పడంతో ఘటన
● అదే సమయంలో సరఫరాలేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
రంపచోడవరం : భద్రాచలం నుంచి పాడేరు వెళ్లే ఆర్టీసీ బస్సు గురువారం అదుపుతప్పి మోతుగూడెం పంచాయతీ ఒడియా క్యాంపు సమీపంలోని 33 కేవీలైన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. జంగిల్ కటింగ్ నిమిత్తం అదే సమయంలో ఏపీ జెన్‌కో సంస్థకు చెందిన డొంకరాయి డిస్ట్రిబ్యూషన్ సిబ్బంది 33 కేవీ/11 కేవీ పవర్ కెనాల్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనివల్ల పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభం దెబ్బతింది. ప్రమాదానికి గురైన బస్సులో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏపీ జెన్‌కో డొంకరాయి డీఈ భాస్కరరావు సంఘటన స్థలానికి వచ్చారు. స్వల్ప గాయాలైన ప్రయాణికులను డొంకరాయిలోని ఏపీ జెన్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం వారిని సీలేరు వరకు ఏపీ జెన్‌కో బస్సులో తరలించారు. అక్కడి నుంచి ఇతర మార్గాల ద్వారా ప్రయాణికులు గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లారు.


