
ఈ నెలా కందిపప్పు లేనట్టే..
సాక్షి, పాడేరు: కూటమి ప్రభుత్వంలో సామాన్యుడు మూడుపూటలా కడుపు నింపుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాడు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ డిపోల ద్వారా క్రమం తప్పకుండా ప్రతి నెలా ప్రతి కార్డుదారునికి అన్ని రకాల నిత్యావసర సరుకులను రాయితీపై అందజేస్తామని ఊరూవాడా దండోరా వేసి మరీ కూటమి నాయకులు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల్లో ప్రధానమైన కందిపప్పును పంపిణీ చేయడం లేదు. కొద్ది నెలలుగా కంది పప్పు పంపిణీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్న కార్డుదారులకు మే నెలా నిరాశే ఎదురైంది. ముచ్చటగా 3వ నెల కూడా పంపిణీ చేయకపోవడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. రేషన్ డిపోల ద్వారా కిలో కంది పప్పును 70 రూపాయలకే అందజేసేవారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.130 పలుకుతోంది. సంతల్లో రూ.160కి విక్రయిస్తున్నారు. దీంతో పేదలు పౌష్టికాహారమైన కందిపప్పును కొనుగోలు చేయలేకపోతున్నారు.
298 టన్నులు అవసరం
జిల్లాలోని 22 మండలాల్లో 2,98,092 రేషన్‌కార్డులు ఉన్నాయి.ఒక్కో కార్డుకు కిలో చొప్పున పంపిణీ చేసేందుకు ప్రతినెలా సుమారు 298 టన్నుల వరకు కందిపప్పు పౌరసరఫరాలశాఖ ద్వారా జిల్లాకు చేరాల్సి ఉంది.అయితే ఈనెల కూడా కందిపప్పు సరఫరా కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా సరఫరా లేదంటూ పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. పౌష్టికాహారం వినియోగంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండగా,సబ్సిడీపై మాత్రం కందిపప్పు పంపిణీ చేయడంలేదు.
3 నెలలుగా నిలిచిన సరఫరా
బియ్యం,పంచదారకే రేషన్ పరిమితం
సంతల్లో కిలో రూ.160
కందిపప్పును ప్రభుత్వం మూడు నెలలుగా పంపిణీ చేయకపోవడం అన్యాయం. సంతల్లో వ్యాపారులు కిలో కందిపప్పును రూ.160కి విక్రయిస్తున్నారు. కందిపప్పును అధిక ధరతో కొనుగోలు చేయలేక వినియోగం మానుకున్నాం.
– బొండ కాంతమ్మ, వంతాడపల్లి గ్రామం,
పాడేరు మండలం
కందిపప్పు పంపిణీ చేయాలి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఇంటి వద్దే బియ్యం,పంచదారతో పాటు నాణ్యమైన కందిపప్పు పాకెట్‌ను అందజేసేవారు. ఆదివాసీ కుటుంబాలకు కందిపప్పు ఎంతో అవసరం.కొత్త ప్రభుత్వం వచ్చాక కందిపప్పును సక్రమంగా పంపిణీ చేయడం లేదు.మూడు నెలలుగా కందిపప్పు పంపిణీ చేయకపోవడం అన్యాయం.గిరిజనులకు పౌష్టికాహారం అందజేయడంపై ప్రభుత్వం శ్రద్ధ చూపి, వెంటనే కందిపప్పును పంపిణీ చేయాలి.
– వంతాల భీమేష్, డల్లాపల్లి,
పాడేరు మండలం

ఈ నెలా కందిపప్పు లేనట్టే..

ఈ నెలా కందిపప్పు లేనట్టే..

ఈ నెలా కందిపప్పు లేనట్టే..