
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?
● జనవరిలో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు ప్రధాన మోదీ శంకుస్థాపన ● ఇంతవరకూ భూమి చదునుకు మాత్రమే పరిమితమైన పనులు ● భవన నిర్మాణాలకు మరో రెండేళ్లు పట్టే అవకాశం ● తాత్కాలిక కార్యకలాపాలకు భవనాలున్నా స్పందించని రైల్వే శాఖ ● ఇప్పట్లో జోన్ కార్యకలాపాలు ఉండవంటున్న వాల్తేరు అధికారులు
రాజకీయాలకు రైల్వే జోన్ బలి!
కూటమి నేతల నిర్లక్ష్యం, ఒడిశా రాజకీయాలకు ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన రైల్వే జోన్ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కనీసం తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలంటూ కూటమి ఎంపీలు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ రైల్వే మంత్రికి, బోర్డును కానీ కోరడం లేదు. శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా దీనిపై ఏ ఒక్క కూటమి ఎంపీ నోరు మెదపకపోవడం జోన్ పాలిట శాపంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఒడిశా పావులు కదుపుతోంది. అత్యధిక ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్‌ను వదులుకోవడం ఇష్టం లేని ఒడిశాలోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారు. అక్కడ రాజకీయ నేతలు కూడా వీరికి సహకరించడంతో.. రైల్వే బోర్డు ఒడిశా ఏం చెబితే అదే చేస్తోంది. ఫలితంగా విశాఖ జోన్ బలవుతూ వస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును చేసే పనులకే పరిమితమైంది. భవనాలు నిర్మించేందుకు మరో రెండేళ్ల సమయం పట్టేలా కనిపిస్తోంది. తాత్కాలిక కార్యకలాపాలకు భవనాలు సిద్ధంగా ఉన్నా రైల్వే శాఖ మాత్రం ముందుకు రావడంలేదు. గతంలోనే ఇక్కడ ఉన్న భవనాల జాబితాను వాల్తేరు అధికారులు పంపించినా.. స్పందించకపోవడం చూస్తుంటే మరో రెండేళ్ల పాటు జోన్ కార్యకలాపాలు మొదలవ్వవేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు 2019లో కేంద్రం పచ్చజెండా ఊపింది. జోన్‌కు సంబంధించిన డీపీఆర్‌ని అదే ఏడాది చివర్లో ఇచ్చేసినా రాజకీయ కక్షతో ముందడుగు వేయలేదు. 2024 ఎన్నికల అనంతరం నవంబర్‌లో టెండర్లు ఆహ్వానించారు. జనవరిలో ప్రధాని చేతుల మీదుగా జోన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అయినా ముడసర్లోవలో భూమి చదును చేసే పనుల్లోనే ఇంకా రైల్వే శాఖ నడిపిస్తోంది. ఈ భూములను తాము సాగుచేసుకుంటున్నామని స్థానికులు ఆందోళన చేయగా.. కూటమి నేతలు రంగంలోకి దిగి జోన్ భవనం వచ్చిన తర్వాత.. అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి వారిని శాంతింపజేశారు. అయినా.. ఇంకా చదును పనులే సా..గుతున్నాయి.
తాత్కాలికానికి భవనాలు సిద్ధంగా ఉన్నా..!
బిల్డింగ్ నిర్మాణంతో పనిలేకుండా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్‌ఎం కార్యాలయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్‌డీ.. తాను సమర్పించిన జోన్ డీపీఆర్‌లోనూ పొందుపరిచారు. రైల్వేస్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా స్టేషన్ బయట ‘గతిశక్తి’ పథకంలో భాగంగా 4 అంతస్తుల భవనాలు రెండు నిర్మించారు. ఒక్కో అంతస్తులో 4,500 చదనపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్‌తో కూడా కలుపుకొంటే దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కొత్త భవనాలు ఉన్నాయి. తాత్కాలిక కార్యకలాపాలు చేపట్టేందుకు గెజిట్ విడుదల చేయాల్సి ఉన్నా బోర్డు నుంచి ఎలాంటి సూచనలు కనిపించడం లేదని వాల్తేరు అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితమే తాత్కాలిక భవనాల జాబితా పంపించామని, ఇప్పటికీ అతీగతి లేకపోవడం చూస్తే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. కూటమి ఎంపీలు, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విశాఖవాసులు కోరుతున్నారు.
జీఎం నియామకం ఎప్పుడో..?
రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభించడానికి రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. రెండేళ్లలో జోనల్ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి, ఆ తరువాత ఆపరేషన్లు ప్రారంభిస్తామని సాకులు చెబుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన రైల్వే జోన్లలో ఎక్కడా.. ఈ తరహా పరిస్థితులు కనిపించలేదు. జోన్ ప్రకటించిన తరువాత కార్యకలాపాల్ని తాత్కాలిక భవనాల్లో ప్రారంభించి.. కొత్త భవనాల నిర్మాణం అనంతరం అక్కడికి మార్చేవారు. కానీ విశాఖ జోన్ విషయంలో మాత్రం ఆది నుంచీ పూర్తి విరుద్ధంగా సాగుతోంది. కొత్త భవన నిర్మాణాలు చేపట్టిన తర్వాతే ఆపరేషన్లు ప్రారంభిస్తామంటూ రైల్వేశాఖ చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే నుంచి విడదీసిన గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లను, విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను కలిపి ‘దక్షిణ కోస్తా’ జోన్‌గా ప్రకటించారు. దాదాపు ఏపీ మొత్తం ఈ జోన్‌లోనే ఉండటంతో రాష్ట్రమంతటికీ సేవలందనున్నాయి. కొత్త రైళ్లు కావాలన్నా, రైల్వే లైన్లు కావాలన్నా జోనల్ అధికారులే ప్రతిపాదనలు పెట్టాలి. ఇది జరగాలంటే జోన్‌కు తొలుత జనరల్ మేనేజర్(జీఎం) నియామకం చేపట్టాలి. ఈ విషయంలోనూ బోర్డు స్పందించడం లేదు.

ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?