కదం తొక్కిన ఉక్కు కాంట్రాక్టు కార్మికులు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన ఉక్కు కాంట్రాక్టు కార్మికులు

Mar 24 2025 4:42 AM | Updated on Mar 24 2025 4:40 AM

గాజువాక : స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ ఆదివారం భారీ పాదయాత్ర నిర్వహించారు. ఉపాధి రక్షణ యాత్ర పేరుతో విశాఖ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో కాంట్రాక్టు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగాజువాక జంక్షన్‌లో ప్రారంభమైన ఈ పాదయాత్ర గాజువాక మెయిన్‌రోడ్‌, పాతగాజువాక, శ్రీనగర్‌ మీదుగా కూర్మన్నపాలెంలోని ఉక్కు కార్మికుల దీక్షా శిబిరం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించడం దారుణమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కూటమి పార్టీలను నమ్మి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చిన కార్మికులకు కూటమి ప్రజాప్రతినిధులు మద్దతు నిలవకపోవడం సరికాదన్నారు. కష్టంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలవాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మడానికి, కార్మికులను తొలగించడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించడానికి ఆ ప్యాకేజీ వల్ల ఎలాంటి ఉపయోగంలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుతామని, నిర్వాసితులకు ఉపాధి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు ఎన్నికల్లో గెలిచిన తరువాత మొహం చాటేస్తున్నారన్నారు.

ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ప్లాంట్‌ కోసం కార్మికులు 1500 రోజుల నుంచి ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.11,400 కోట్లు ప్యాకేజీ ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను రోడ్డుపైకి నెట్టేయడం కోసం ప్రయత్నిస్తోందన్నారు. అందులోభాగంగా ఇప్పటికే వెయ్యి మందిని బయటకు పంపేసిందన్నారు. సెయిల్‌లో కలపడానికి గాని, సొంత గనులు కేటాయించడానికి గాని కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదని, అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయకుండా ఉద్యోగులను తొలగిస్తోందన్నారు. కార్మికుల తొలగింపును ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

గాజువాక నుంచి కూర్మన్నపాలెం వరకు

ఉపాధి రక్షణ పాదయాత్ర

తొలగించిన కాంట్రాక్టు కార్మికులను

విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement