రంపచోడవరం: ఉపాధి హామీ పథకం పనులను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో ఉపాధి హామీ పథకంలో 3 వేల ఫారం పాండ్‌లను మంజూరు చేసినట్టు ఆయన చెప్పారు. ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని రంప పంచాయతీ పరిధిలోని పందిరిమామిడి గ్రామంలో ఫారం ఫాండ్‌ల నిర్మాణ పనులను పీవో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి 25 ఫారం పాండ్‌లను మంజూరు చేసినట్టు చెప్పారు. రెండు వేల ఫారం పాండ్‌లను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఒక్కో రైతుకు రూ.50 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు మంజూరు చేసి ఫారం పాండ్‌లను తవ్విస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఉపాధి కూలీకి రూ.300 చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, రంప సర్పంచ్ చెదల వెంకటలక్ష్మి, ఎంపీడీవో సుండం శ్రీనివాసరావుదొర, ఏపీవో బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం