
గిరిజన మత్స్యకారులను విస్మరించిన ప్రభుత్వాలు
ముంచంగిపుట్టు: గిరిజన మత్స్యకారుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని కొత్తసుజనకోటలో ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా కో–కన్వీనర్ వి.అమర్ ఆధ్వర్యంలో శుక్రవారం మత్స్యగెడ్డ పరీవాహక ప్రాంత గిరిజన మత్స్యకారులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో వేలాదిమంది గిరిజన మత్స్యకారులకు రాయితీలు,సౌకర్యాలు కల్పించడంలో జిల్లా మత్స్యశాఖ అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.సుజనకోటలో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ సంవత్సరాలు గడుస్తున్న వినియోగంలోకి రాలేదని చెప్పారు. మైదాన ప్రాంత మత్స్యకారులకు కల్పించే అన్ని సౌకర్యాలు గిరిజన మత్స్యకారులకు అందించాలని కోరారు. వలలు,బోట్లు అందించడంతో పాటు రాయితీలపై రుణాలు మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పింఛన్లు,ప్రమాదవశాత్తు చనిపోతే రూ.20లక్షలు ఎక్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా మత్స్య కార్మిక సంఘం నేత లక్ష్మణ్,మండల గిరిజన మత్స్య కార్మిక సంఘం నాయకులు నరేష్,లక్ష్మణరావు, భాస్కర్,సొమన్న,గణపతి తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నాగాంజనేయులు