అరకులోయ టౌన్(అనంతగిరి): ఆదివాసీ చట్టాల ను ధిక్కరించి కార్పొరేట్ కంపెనీలకు కేటాయించిన హైడ్రో పవర్ ప్రాజెక్టుల అనుమతులు తక్షణమే రద్దు చేయాలని సీపీఎం అల్లూరి జిల్లా కమిటీ కార్యదర్శి పి. అప్పలనర్స డిమాండ్ చేశారు. అనంతగిరి మండలంలో సోమవారం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. చిట్టెంపాడు హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రాంతం నుంచి అనంతగిరి వరకు ఐదు కిలోమీటర్ల వరకు మూడు గ్రామాలను కలుపుతూ యాత్ర ఉత్సాహంగా సాగింది. పెద్దబిడ్డ, టోకూరు పంచాయతీ నుంచి బాధిత ప్రజలు, పీసా కమిటీ సభ్యులు, గ్రామ వార్డు సభ్యులు, సర్పంచ్‌లతో కలిసి జెడ్పీటీసీ గంగరాజు నాయకత్వంలో పాదయాత్ర నిర్వహిస్తూ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్ వి.మాణిక్యం, ఎంపీడీవో ఎ.వి.వి. కుమార్‌లకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం సభకు సీపీఎం మండల కార్యదర్శి, టోకూరు పంచాయతీ సర్పంచ్ కిలో మోస్య అధ్యక్షత వహించగా, పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో సహజ వనరులను దోచుకోవడానికి కార్పొరేట్ కంపెనీలకు అడ్డుగా ఉందని 1/70 చట్టాలను బలహీనం చేస్తున్నారని విమర్శించారు. అందుకే కొంత మంది ప్రజా ప్రతినిధులు ఆదివాసీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 1/70 చట్ట సవరణ లేదని ముఖ్యమంత్రి ప్రకటించి, మరో పక్క చట్టానికి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు సహజ వనరులను అప్పగించడం సరికాదని విమర్శించారు. జెడ్పీటీసీ మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మిస్తే నాలుగు వేల ఎకరాలు భూమి మునిగిపోయే అవకాశం ఉందని, 40 గ్రామాల గిరిజనులు నిర్వాసితులు కానున్నారని వాపోయారు. సీపీఎం నాయకులు సోమెల నాగులు, సీవేరి కొండలరావు, వంతల బుద్రయ్య, కాకర సింగులు, గెమ్మల భీమరాజు తదితరులు పాల్గొన్నారు.
హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు
తక్షణమే రద్దు చేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలపర్స, అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు డిమాండ్
కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి