
ఫ్లైఓవర్‌పై లారీ బోల్తా
గోపాలపట్నం (విశాఖ): ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌పై పేపర్ బండిల్స్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం, బ్రిడ్జిపైనే లారీ బోల్తా పడటంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివీ.. కోల్‌కతా నుంచి షీలానగర్‌కు పేపర్ బండిల్స్ లోడుతో వెళ్తున్న లారీ.. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌పైకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న పేపర్ బండిల్స్ రోడ్డుపై పడిపోయాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఇతర వాహనాల రాకపోకలు లేకపోవడం, లారీ కూడా బ్రిడ్జిపైనే బోల్తా పడటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ప్రమాదంలో క్లీనర్ ఆలీకి స్వల్ప గాయాలయ్యాయి. కంచరపాలెం ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బోల్తా పడిన లారీలో ఉన్న 60 బండిల్స్‌ను మరో లారీలోకి క్రేన్ సాయంతో లోడింగ్ చేసి షీలానగర్ తరలించారు. లారీని బ్రిడ్జి పై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బ్రిడ్జిపైకి ఎక్కి రోటరీలో వెళ్లే సమయంలో డ్రైవర్ నిద్రమత్తు వల్ల లారీని అదుపు చేయలేక బోల్తా పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ప్రమాద వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఎన్‌ఏడీ వద్ద తప్పిన పెను ప్రమాదం
పేపర్ బండిల్స్‌ను మరో లారీలో తరలించిన ట్రాఫిక్ పోలీసులు