ఏవోబీలో రెడ్‌ అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఏవోబీలో రెడ్‌ అలర్ట్‌

Sep 20 2023 12:42 AM | Updated on Sep 20 2023 11:53 AM

ఏవోబీలో కూంబింగ్‌కు వెళ్తున్న పోలీసు బలగాలు - Sakshi

ఏవోబీలో కూంబింగ్‌కు వెళ్తున్న పోలీసు బలగాలు

సాక్షి,పాడేరు: మావోయిస్టు పార్టీ 19వ వార్షిక వారోత్సవాలకు సన్నద్ధమవుతున్న వేళ.. పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఇప్పటికే ఆ పార్టీ చర్ల, శబరి ఏరియా కమిటీ పేరుతో ఎటపాక ప్రాంతంలో పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, చత్తీస్‌గఢ్‌, ఆంధ్రా, ఒడిశా పోలీసు యంత్రాంగాన్ని కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది, తెలంగాణ, చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లోని దండకారణ్య ప్రాంతం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు సరిహద్దులో ఉన్నందున పోలీసు శాఖ రెడ్‌ అలెర్ట్‌ను అమలుజేస్తోంది.

ముమ్మరంగా కూంబింగ్‌
చింతూరు, రంపచోడవరం, పాడేరు, చింతపల్లి పోలీసు సబ్‌డివిజన్ల అధికారులను ఎస్పీ తుహిన్‌ సిన్హా అప్రమత్తం చేశారు. ఏవోబీ వ్యాప్తంగా కూంబింగ్‌కు ఆదేశాలిచ్చారు. జిల్లాతో పాటు సరిహద్దులో ఉన్న ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌, చత్తీస్‌గఢ్‌లోని పోలీసు యంత్రాంగమంతా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్‌కు విస్తృతం చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లతో పాటు అవుట్‌పోస్టులు, ఒడిశాలోని కటాఫ్‌ ఏరియాలోని అవుట్‌పోస్టుల్లో రెడ్‌ అలర్ట్‌ను అమలు చేస్తున్నారు. పోలీసు బలగాలు డేగకన్నుతో అడవిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఏవోబీ వ్యాప్తంగా అవుట్‌పోస్టుల్లోను అదనపు బలగాలు మోహరించాయి.

నైట్‌ హాల్ట్‌ సర్వీసుల నిలిపివేత: మావోయిస్టు పార్టీ వార్షికోత్సవ వారోత్సవాలు ముగిసేంతవరకు జిల్లాలోని నైట్‌హాల్ట్‌ ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. రంపచోడవరం, సీలేరు ప్రాంతాల నుంచి చింతూరు మీదుగా భద్రాచలం వెళ్లే రాత్రి బస్సు సర్వీసులను ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా కూనవరం మీదుగా న డుపుతున్నారు. మారుమూల గ్రామాలకు రాకపోకలు సాగించే వాహనాలను పోలీసు బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.

అప్రమత్తం చేసిన పోలీసులు
మావోయిస్టు పార్టీ అవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ,పలు రాజకీయ పార్టీల నేతలంతా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండేలా అప్రమత్తం చేస్తూ పోలీసుశాఖ నోటీసులు జారీ చేసింది. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు మారుమూల ప్రాంతాల పర్యటనలను రద్దు చేసుకోవాలని ఇప్పటికే సూచించింది.

పోలీసుశాఖ అప్రమత్తం
మావోయిస్టు పార్టీ అవిర్భావ వార్షిక వారోత్సవాలతో జిల్లాలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. జిల్లాకు సరిహద్దులో ఉన్న అన్ని రాష్ట్రాల పోలీసు యంత్రాంగంతోను సమన్వయం చేసుకుంటూ జిల్లా పోలీసు బలగాలను కూంబింగ్‌ చర్యల్లో నిమగ్నం చేసాం.ప్రజాప్రతినిధులు,రాజకీయ పార్టీల నేతలు,అధికారులంతా మారుమూల ప్రాంతాలకు వెళ్లకుండా తగిన ఆదేశాలిచ్చాం, జిల్లా వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించి భద్రతా చర్యలను విస్తృతం చేశారు.

వారోత్సవాలనుఅడ్డుకుంటాం
సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్లు,ఇతర స్పెషల్‌ పార్టీ పోలీసులంతా కూంబింగ్‌ చేపడుతున్నారు. ఎస్‌బీ, ఇంటిలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగాయి. మావోయిస్టు పార్టీ అవిర్భావ వారోత్సవాలను అడ్డుకుంటాం. జిల్లాకు సరిహద్దులో ఉన్న అన్ని రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలను సమన్వయం చేసుకుంటూ కూంబింగ్‌ ముమ్మరం చేశాం.
– తుహిన్‌సిన్హా, ఎస్పీ, పాడేరు

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement