ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేయడంపై ఫోకస్ పెంచుతాం.. ప్రతీ బడిలో మౌలిక వ సతుల కల్పనకు కృషి చేస్తాం.. అలాగే ఉపాధ్యాయులు సమయపాలన పా టించేలా, నా ణ్యమైన విద్యాబోధన చేసేలా చర్యలు చేపడతామని నూతన డీఈ వో డి.మాధవి అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఎలాంటి చర్యలు చేపడతారు..?
డీఈవో: బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పా టు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం, కంప్యూటర్ విద్యతో పాటు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నా యి. ఈమేరకు తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి.
సాక్షి: కొంత మంది ఉపాధ్యాయులు రెగ్యులర్‌గా విధులకు ఎగనామం పెడుతున్నారు.. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు చేపడతారు..?
డీఈవో: స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయాలి. ఫేషియల్ అటెండెన్స్ ద్వారా సమయపాలన పాటించని వారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. నెట్వర్క్ లేదని సాకులు చెప్పొద్దు. డొంగల్ ఏర్పాటు చేసుకోనైనా అటెండెన్స్ వేసుకోవాలి.
సాక్షి: విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం మొదటి రోజే పంపిణీ జరుగుతుందా..?
డీఈవో: పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ ఇప్పటికే మండల పాయింట్‌లకు చేరుకున్నాయి. ప్రస్తుతం పాఠశాలలకు సరఫరా అవుతున్నాయి. మొదటి రోజే విద్యార్థులకు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నాం. యూనిఫాం టెండర్లు జరుగుతున్నాయి. బడులు తెరిచే వరకు వచ్చే అవకాశం ఉంది.
సాక్షి: ఉపాధ్యాయుల కొరతను ఏవిధంగా అధిగమిస్తారు..?
డీఈవో: ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయం వాస్తవమే. అయినప్పటికీ విద్యార్థుల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా దృష్టి సారిస్తాం. 464 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవసరం ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. స్కూళ్లలో స్కావెంజర్ల సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈమేరకు చర్యలు చేపడతాం.
సాక్షి: శిథిలావస్థ బడులపై ఎలాంటి దృష్టి సారిస్తున్నారు..?
డీఈవో: జిల్లాలో ఎన్ని శిథిల బడులు ఉన్నాయో గుర్తించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నవాటిని తొలగించాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు చర్యలు చేపడతాం.
సాక్షి: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు న్నాయి. ఎలాంటి చర్యలు చేపడతారు..?
డీఈవో: ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలతో పాటు కేజీబీవీల్లో మెనూ సక్రమంగా అమలు చేసేలా చూస్తాం. ఏ రోజు ఎవరు విధుల్లో ఉన్నారనే విషయాన్ని వారి పేర్లతో సహా నోటీసు బోర్డుపై ప్రదర్శించాలి. ఇష్టానుసారం వ్యవహిరించే వారిపై చర్యలు తప్పవు.
సాక్షి: ఇటీవల కొంత మంది టీచర్లు విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు. వాటిని అధిగమించేలా ఎలాంటి చర్యలు చేపడతారు..?
డీఈవో: ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తాం. గురువు స్థానంలో ఉన్నవారు బాధ్యతలు విస్మరించవద్దు. చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే శాఖాపరంగా, చట్టపరమైన చర్యలు తప్పవు.


