జిల్లాలో అందుబాటులోకి వస్తే సాగు, నీటిపారుదల ప్రాజెక్టులకు నాణ్యమైన కరెంట్ నిర్వహణపై కొనసాగుతున్న తర్జనభర్జన
జిల్లాలో గృహ, వ్యవసాయ, ఇతర విద్యుత్ కనెక్షన్లు కలిపి 3లక్షలకు పైగా ఉండగా, అందులో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు వేలాదిగా ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర తెలంగాణకు సంబంధించి టీజీఎన్‌పీడీసీఎల్‌లో జిల్లాకు సంబంధించి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చే రైతు డిస్కంలో వ్యవసాయ, నీటిపారుదల ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు, మిషన్ భగీరథ, పురపాలక, గ్రామీణ నీటి సరఫరా విద్యుత్ సరఫరా కనెక్షన్లన్నీ కొత్తగా ఏర్పడే డిస్కం పరిధిలోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది.
సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం రైతు డిస్కం ఏర్పాటుపై రాజకీయంగా దుమారం నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్‌పీడీసీఎల్)ను మూడో విద్యుత్ పంపిణీ సంస్థగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రత్యేకంగా వ్యవసాయ, నీటి సరఫరా కనెక్షన్ల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కంపెనీలు ఉండగా, ప్రభుత్వం ఈ రైతు డిస్కంను తీసుకొస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకే దీన్ని తీసుకొస్తుందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండిస్తుంది.
నిర్వహణపై తర్జనభర్జన
ఈ మూడో డిస్కం ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత, నిరసనలు ఎదురవుతున్నాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్ భవిష్యత్తు, ప్రైవేటీకరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ వారు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడే డిస్కం పరిధిలోకి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ కోసం వెయ్యి మంది సిబ్బందిని తీసుకుంటున్నారనే చర్చ సాగుతుంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి 11కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు వేలాదిగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందే సమస్యలు ఏర్పడినప్పుడు నివారించలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా ఖాళీ పోస్టులతోనే ఈ సమస్య ఎదురవుతుందని శాఖాపరమైన చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త డిస్కం ఏర్పాటు చేసి సిబ్బందిని అటు ఇటుగా విభజించిన పక్షంలో పాత, కొత్త డిస్కంల పరిధిలో విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డిస్కం ఏర్పాటు జరుగుతుందా.. లేనిపక్షంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందోనని వేచి చూడాల్సిందే.
ఈ విషయమై ఆదిలాబాద్ ఎస్‌ఈ శేష్‌రావును వివరణ కోరగా, సంస్థ నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదని, ఈ దృష్ట్యా ఎలాంటి వివరాలు చెప్పలేమని స్పష్టం చేశారు.
జిల్లాలో..
జిల్లాలో..
గృహ, వ్యాపార, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లు
2లక్షల 65వేలు
వ్యవసాయ, నీటిపారుదల కనెక్షన్లు
35వేలు
11కేవీ వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు
5,700


